గజ్వేల్, ఆగస్టు 15: అప్పుల బాధతో రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం క్యాసారంలో చోటుచేసుకున్నది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. క్యాసారం గ్రామానికి చెందిన సంగపు ఆంజనేయులు(48) పంట సాగుకోసం అప్పు చేశాడు. పంటలు సరిగా పండకపోవడంతో తీవ్ర మనస్తాపంతో శుక్రవారం వేకువజామున పురుగుల మందుతాగాడు. గమనించిన కుటుంబీకులు హైదరాబాద్ తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గజ్వేల్ సీఐ రవికుమార్ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మరో ఆటో డ్రైవర్ బలి ; కరీంనగర్లో జిల్లాలో పర్లపల్లిలో విషాదం
తిమ్మాపూర్, ఆగస్టు 15 : మహిళల ఉచిత ప్రయాణం కోసం తెచ్చిన మహాలక్ష్మి పథకం ఆటో డ్రైవర్లను ఆగం చేస్తున్నది. ఉపాధికి దెబ్బకొట్టి రోడ్డున పడేస్తున్నది. ఇటు ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో బతుకు బజారుపాలవుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లోనే కరీంనగర్ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ ఉపాధి లేక.. ఆటో కిస్తీలు కట్టలేక ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఎల్ఎండీ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. పర్లపల్లికి చెందిన గోపగానే సంతోష్ (29) కొన్నేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆటో సరిగా నడవక ఓ ఫైనాన్స్‌లో తీసుకున్న కిస్తీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ నెల14న రాత్రి ఉరివేసుకొని చనిపోయాడు.