యాదగిరిగుట్ట/మోటకొండూర్, జూలై 8: ఎస్సై వేధింపులతో మహిళారైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకున్నది. బాధితురాలి కొడుకు మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. మోటకొండూర్ నుంచి మేడికుంటపల్లి వెళ్లేదారి పక్కనే భూమండ్ల బాల నర్సయ్య పేరిట 1.38 ఎకరాల పట్టా భూమి ఉంది. కబ్జాలో మాత్రం 1.18 ఎకరాలే ఉన్నట్టుగా ఉంది.
మరో 20 గుంటల భూమి కోసం 2023లో సర్వే చేసేందుకు చలాన్ కట్టారు. అప్పటి జిల్లా సర్వే అధికారి పంచనామా చేసి హద్దురాళ్లు పాతారు. అదే సర్వే నంబర్లో భువనగిరి మండలం గూడూరుకు చెందిన కొంతం ఆండాలు 5 ఎకరాలు కొనుగోలు చేయడంతో పాటు బాలనర్సయ్య భూమి హద్దురాళ్లను తొలగించారు. దీనిపై ఇరువర్గాలు ఫిర్యాదు చేయగా ..పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పోలీసుల వేధింపులతో విసుగుచెందిన బాలనర్సయ్య భార్య మల్లమ్మ మంగళవారం పోలీసుల సమక్షంలోనే పురుగులమందుతాగింది. కుటుంబసభ్యులు హైదరాబాద్లోని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.