బోధన్ రూరల్, మార్చి 5: నిజాంసాగర్ ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీళ్లు అందక పంట ఎండిపోతుండడంతో మనస్తాపం చెందిన ఓ రైతు బుధవారం ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కొప్పర్తి క్యాంప్‌నకు చెందిన మాజీ సర్పంచ్ గురునాథం.. జాడిజమాల్‌పూర్ శివారులో గల ఆరున్నర ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాడు. నిజాంసాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా నీళ్లుండడంతో పంటకు ఢోకా ఉండదని భావించాడు. పొట్ట దశకు వచ్చేసరికి రెండు బోర్లు ఎ త్తిపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతో నిజాంసాగర్ చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. అప్పు చేసి వరి వేస్తే చేతికందే దశలో పంట ఎండిపోవడంతో గురునాథం తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం పురుగుల మందు డబ్బా తీసుకుని వెళ్తుండడాన్ని గమనించిన తోటి రైతులు మందు డబ్బా లాగేసుకున్నారు. కండ్ల ముందే పంట ఎండిపోతుంటే గుండె తరుక్కు పోతున్నదని రైతులు వాపోయారు. చివరి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకుంటలేరని, కెనాల్‌కు నీళ్లు విడుదల చేసి 12 రోజులవుతున్నా చివరిదాకా నీళ్లు రావడం లేదని తెలిపారు. రూ.లక్షలు అప్పు చేసి ఆరున్నర ఎకరాల్లో వరి వేస్తే, చేతికొచ్చే సమయంలో నీళ్లుఅందక ఎండిపోతున్నదని గురునాథం కుమారుడు కృష్ణప్రసాద్ తెలిపారు. అధికారులు చివరి ఆయకట్టుకు నీళ్లివ్వాలని కోరారు.