వీర్నపల్లి, ఆగస్టు 21 : రైతులకు సకాలంలో యూరియా అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఓ రైతు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘యూరియా ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత? చేతకాకుంటే దిగిపోండి’ అంటూ మండిపడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం బంజేరుకు చెందిన రైతు పర్లపల్లి శ్రీశైలంకు వీర్నపల్లి శివారులో నాలుగెకరాలు భూమి ఉన్నది. అందులో వరి సాగు చేస్తున్నాడు. యూరియా కోసం 20 రోజులుగా తిరుగుతున్నాడు. మద్దిమల్ల, వీర్నపల్లి సొసైటీల వద్ద మూడు రోజులుగా లైన్ కట్టినా యూరియా దొరకలేదు.
గురువారం బాబాయి చెరువుతండాలో మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పంపిణీ కేంద్రానికి వెళ్లి రెండు గంటలకుపైగా నిరీక్షించాడు. పది బస్తాలు అవసరముంటే రెండు బస్తాలే దొరికాయి. దీంతో ప్రభుత్వ తీరుపై ఆక్రోషాన్ని వ్యక్తంచేస్తూ ఓ వీడియో రికార్డు చేశాడు. ‘కాంగ్రెస్లో ఉన్న కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి వర కు ప్రతిపక్ష నాయకులను తిట్టడం తప్ప మరేం పనిలేదేమో వీళ్లకు. లారీ యూరి యా వస్తే రైతులు ఎగబడి మనిషికో సంచి లాక్కుంటున్నరు. పంటలు వేసి రెండు నెలలు గడిచినా యూరియా సైప్లె చేయలేకపోతున్నరు. సకాలంలో సైప్లె చేయని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత? ఊడితే ఎంత? యూరియా అడిగితే గొడవ పెట్టడం, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ను తిట్టడం తప్ప యూరియా సరఫరా చేయడం చేతకాదు’ అంటూ మండిపడ్డాడు.