సిద్దిపేట, మార్చి 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలివెళ్లేందుకు పార్టీ అభిమానులు, కార్యకర్తలు వినూత్న రీతిలో సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న భారీ బహరంగ సభకు తరలి వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్న మహిళలు ఎవరి తొవ్వ ఖర్చులు వారే సమకూర్చుకుంటున్న దృశ్యం సిద్దిపేట జిల్లాలో కనిపిస్తున్నది. సోమవారం సిద్దిపేట జిల్లా మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలం లక్ష్మీపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నేతలు, మాజీ మహిళా ప్రజాప్రతినిధులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
బహిరంగ సభకు హాజరయ్యేందుకు వాహన కిరాయిలు, భోజనాలు, దారి ఖర్చుల కోసం కూలి పనులు చేపట్టారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారు, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లపాటు వివిధ హోదాల్లో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారు సైతం కూలి పని చేయడం విశేషం.
బెజ్జంకి మండలం లక్ష్మీపూర్‌లోని రైతు బాల్‌రెడ్డి మక్కచేనులో బీఆర్ఎస్ మహిళా నేతలు, మాజీ ప్రజాప్రతినిధులు కూలి పని చేశారు. మక్కలు ఏరే కార్యక్రమంలో పాల్గొన్నారు. చేనులో ఉన్న కంకులను ఏరారు. సుమారు వంద మందికిపైగా మహిళా నేతలు పనిలో పాల్గొన్నారు. దాదాపు 3 గంటలు పని చేశారు. ఇందుకుగాను వారికి రైతు రూ.10 వేలు ఇచ్చారు. వీటిని కేసీఆర్ సభకు వినియోగించుకుంటామని మహిళా నేతలు చెప్పారు. రజతోత్సవ సభకు భారీ ఎత్తున తరలివెళ్తామని మహిళలు, రైతులు చెప్తున్నారు.
కేసీఆర్ సార్ మళ్లీ వస్తేనే ప్రజల గోస తీరుద్ది. రేవంత్‌రెడ్డి మహిళలకు రూ.2,500 ఇస్తా అన్నడు. రూపాయి ఇవ్వలేదు. కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తా అన్నడు. ఇవ్వలేదు. కేసీఆర్‌సార్ ఉండగా రూ.లక్ష కట్నం అందుతుండే. ఇప్పుడు ఏదీ లేదు. రుణమాఫీ, రైతుభరోసా అన్నడు కానీ రాలేదు. రూ.4 వేల ఫించన్ అన్నడు కానీ, రూ.2 వేలకు కూడా గతి లేదు. ప్రజలను పిచ్చోళ్లను చేస్తుండు, కేసీఆర్ సార్ వస్తేనే ప్రజలు మంచిగ ఉంటరు. ఆ సారే మళ్లీ రావాలి.
– ముక్కీస విజయ, మహిళా రైతు, లక్ష్మీపూర్
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లేందుకు అవసరమైన దారి ఖర్చుల కోసం లక్ష్మీపూర్‌లో రైతు బాల్‌రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో మకజొన్న కంకులు ఏరుతూ కూలి పని చేసిన ఆడబిడ్డలకు కృతజ్ఞతలు. ఆనాడు కేసీఆర్‌ను ముందుండి నడిపి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది ఆడడబిడ్డలే. కొట్లాడి తెచ్చిన తెలంగాణలో పదేండ్లు కేసీఆర్‌ను దీవించి సీఎంను చేసింది ఆడబిడ్డలే. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం వాహనాలను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుచేస్తుందని తాము చెప్పినప్పటికీ, తమ సొంత ఖర్చులతోనే వాహనాలు ఏర్పాటు చేసుకుని వస్తామని కూలి పనిచేసిన ఆడబిడ్డలకు శతకోటి వందనాలు. ఇది పార్టీ పట్ల, కేసీఆర్ పట్ల వారుచూపుతున్న అభిమానానికి నిదర్శనం.
– మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే, రసమయి బాలకిషన్