చెన్నూర్ రూరల్, ఏప్రిల్ 10 : బోరు మోటర్‌కు మరమ్మతులు చేస్తుండగా, ఓ రైతు కూలి మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం నాగాపూర్‌లో గురువారం చోటుచేసుకున్నది. చెన్నూర్ ఎస్ఐ వెంకటేశ్వర్రావు కథనం ప్రకారం.. నాగాపూర్ గ్రామానికి చెందిన బడికెల లచ్చయ్యకు చెందిన వ్యవసాయ బోరు మోటర్ చెడిపోయింది. మరమ్మతుల అనంతరం రైతు కూలి కర్ణాల లింగయ్య (48)తో పాటు మరో ముగ్గురు బావిలోకి మోటర్ దింపారు. ఆపై లింగయ్య భుజంపై మోటర్ పైపును పెట్టుకొని వెనక్కి వస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు పైపునకు తగలడంతో షాక్ తగిలి, అక్కడికక్కడే మృతి చెందాడు. పాంతెపు రంజిత్, బడికెల లచ్చయ్య, అంగ రమేశ్‌కు స్వల్పగాయాలయ్యాయి. మృతుడికి భార్య పరిమళ, కూతురు, కుమారుడు ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు.