దుబ్బాక, నవంబర్ 23 : అప్పుల బాధతో వ్యవసాయ కూలీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన డప్పు చంద్రం (50) వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు తీర్చేందుకు తనకున్న ఎకరం వ్యవసాయ భూమిని అమ్మేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో మానసికంగా కలతచెందిన చంద్రం శనివారం రాత్రి గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం అటుగా వెళ్లిన గ్రామస్థులు చంద్రం మృతదేహాన్ని చూసి, పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి కుమారుడు వినయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టినట్టు దుబ్బాక సీఐ శ్రీనివాస్ తెలిపారు.