హైదరాబాద్: డీజీపీ జితేందర్ (DGP Jitender) పదవీ విరమణ కార్యక్రమాన్ని తెలంగాణ పోలీసు అకాడమీలో ఘనంగా నిర్వహించారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్రంలో సైబర్ క్రైమ్, నార్కోటిక్స్పై కఠిన చర్యలు తీసుకున్నామని, ఈ రెండింటితో నిరంతరం యుద్ధం చేస్తున్నామన్నారు. గత 15 నెలల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు. రాష్టవ్యాప్తంగా క్రైమ్ రేట్ తగ్గించడానికి అనేక చర్యలు చేపట్టామని వెల్లడించారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసుకు మంచి గుర్తింపు వచ్చింది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణ మొదటి స్ధానంలో ఉందన్నారు.
గత 33 ఏండ్లుగా ఏపీ, తెలంగాణలో పోలీస్ శాఖలో కీలక పదవుల్లో పని చేశానని చెప్పారు. పంజాబ్లో పుట్టి పెరిగానని.. పోలీస్ శాఖలో ఉండి ప్రజలకు సేవ చేయడం మర్చిపోలేని అనుభమన్నారు. తన 40 ఏండ్ల జీవితం 40 రోజుల్లా గడిచిపోయిందని తెలిపారు. నక్సలిజం, టెర్రరిజం వంటి సంఘాలు నుంచి ప్రజలకు రక్షణ కల్పించామని చెప్పారు. వరదలను సమర్థంగా ఎదుర్కొన్నామని, గణేశ్ నిమజ్జనం, శ్రీరామ నవమి, బక్రీద్ వంటి పండగల్లో చిన్న తప్పిదం లేకుండా నిర్వహించామన్నారు. తెలంగాణ పోలీస్ శాఖ కేవలం తెలంగాణ ప్రజల కోసమే కాకుండా ఇతర రాష్ట్రాల కోసం కూడా పని చేసిందని వెల్లడించారు. బెట్టింగ్ యాప్స్ నిర్వాహకుల అరెస్ట్, సైబర్ నేరగాళ్లు, ఆర్థిక నేరాలు చేసే వారిని అరెస్ట్ చేయడం వంటివి దీనికి సాక్ష్యమన్నారు.
తెలంగాణ పోలీస్ మీద నమ్మకం ఉందని, శాంతి భద్రతలు కాపాడటంలో ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. దేశంలోనే తెలంగాణ పోలీస్ శాఖ నంబర్ వన్ స్థానంలో ఉంది. నేరాల నియంత్రణకు టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబోయే నూతన డీజీపీ శివధర్ రెడ్డి డీజీపీ పదవికి అర్హుడు. శివధర్ రెడ్డికి నాకు మంచి స్నేహబంధం ఉందని, ఎన్నో ఏండ్ల పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. శివధర్ రెడ్డి సేవలు తెలంగాణ ప్రజలకి ఎంత గానో ఉపయోగపడతాయన్నారు.