ఎడపల్లి, అక్టోబర్ 5: ఆన్లైన్ బెట్టింగ్‌కు మరో కుటుంబం బలైంది. రూ.లక్షలు పోగొట్టిన ఓ యువకుడితోపాటు అతడి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన శనివారం నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన రంగణవేణి సురేశ్ (55), హేమలత (48) దంపతులకు ఇద్దరు సంతానం. మెదడువాపు వ్యాధితో కూతురు చిన్నప్పుడే మృతి చెందింది.
ఏకైక కుమారుడు హరీశ్ (22) నిజామాబాద్‌లో ఉంటూ పెట్రోల్ బంక్‌లో పని చేసేవాడు. ఆర్నెళ్ల క్రితం పని మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. సురేశ్ దంపతులు చిన్న కిరాణ షాపు నడుపుతూ వ్యవసాయ కూలీలుగా పని చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కొత్త ఇల్లు కట్టుకుందామన్న ఆశతో గృహ నిర్మాణాన్ని ప్రారంభించారు. కుమారుడు హరీశ్ ఆన్లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి భారీగా అప్పులు చేశాడు. దీంతో తల్లిదండ్రులు ఇంటి నిర్మాణాన్ని ఆపేశారు.
హరీశ్ చేసిన రూ.30 లక్షలకుపైగా అప్పులను తమకున్న 20 గుంటల భూమిని అమ్మేసి తీర్చారు. అయినప్పటికీ కుమారుడిలో మార్పు రాలేదు. నలుగురిలో తిరగలేక మనస్తాపం చెందిన తల్లిదండ్రులు, కుమారుడు శుక్రవారం రాత్రి ఉరేసుకున్నారు. తెల్లారినా ఎలాంటి అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు వారు తలుపులు కొట్టినా లోపల నుంచి స్పందన రాలేదు. ఇంటి వెనుక నుంచి చూడగా వేలాడుతూ కనిపించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం బోధన్ దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.