హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌లో టికెట్ల కేటాయింపు మామూలుగా ఉండదు మరి! దరఖాస్తుల స్వీకరణ, వడపోత, అధిష్ఠానానికి జాబితా, ఆ తర్వాత ప్రకటన.. ఇలా చాలా ఉంటుందని ఎవరైనా అనుకుంటారు. కానీ, అదంతా ఒట్టి ముచ్చటేనని, ఆశావహులను నమ్మించేందుకు ఇచ్చే బిల్డప్పేనని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ఒకవేళ ఇన్ని ప్రక్రియలే ఉంటే మహబూబ్‌నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని ఏకపక్షంగా ఎలా ప్రకటించారని ప్రశ్నిస్తున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి మొదలు ముఖ్యనేతలంతా ‘ఇది నాకు.. అది నీకు’ అన్నట్టుగా పంచేసుకుంటారని పార్టీలోని ద్వితీయశ్రేణి నాయకులు ఆరోపిస్తున్నారు. మొత్తంగా టికెట్ల పంపిణీ కాంగ్రెస్‌లో ప్రహసనంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజర్వుడు సీట్లను కూడా నేతలు వదిలి పెట్టడం లేదని విచారం వ్యక్తం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ముఖ్యనేతలు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తుండడంతో ఆశావహులు ఆశలు వదిలేసుకుంటున్నారు.
ఫ్యామిలీ ప్యాక్
ఎంపీ టికెట్లను చాలావరకు పార్టీ పెద్దలు తన్నుకుపోయే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గం నుంచి ఎవరో ఒక నాయకుడు కుటుంబ సభ్యుల కోసం రంగంలోకి దిగుతుండడంతో టికెట్ ఆశలు పెట్టుకున్న వారు నీరుగారిపోతున్నారు. నల్లగొండ ఎంపీ టికెట్‌ను తన కుమారుడు రఘువీర్‌రెడ్డికి ఇప్పించుకునేందుకు సీనియర్ నేత జానారెడ్డి ప్రయత్నిస్తుంటే, భువనగిరి టికెట్‌ను తన కుమార్తె, లేదంటే భార్యకు ఇప్పించుకోవాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
మరోవైపు ఆయన సోదరుడు, మంత్రి వెంకట్‌రెడ్డి మాత్రం తన సోదరుడు మోహన్‌రెడ్డి కుమారుడి కోసం ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం టికెట్‌ను తన భార్య నందినికి ఇప్పించేందుకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రయత్నిస్తుండగా, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన సోదరుడు ప్రసాద్‌రెడ్డి కోసం, మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన కుమారుడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
పెద్దపల్లి టికెట్ వంశీకే
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిన తన భార్య నిర్మలగౌడ్కు మెదక్ టికెట్ ఇవ్వాలని, కుదరకుంటే తన కుమార్తెకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి పట్టుబడుతున్నారు. ఇదే టికెట్ తన కుమార్తె త్రిష కోసం మంత్రి దామోదర రాజనరసింహ ప్రయత్నిస్తుండగా, మైనంపల్లి హన్మంతరావు కూడా రేసులో ఉన్నట్టు తెలిసింది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు వంశీకి పెద్దపల్లి టికెట్ దాదాపు ఖాయమైందని సమాచారం.