టేకుమట్ల, జూన్ 19: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో గాజర్ల రవితోపాటు (Gajarla Ravi) పలువురు మావోయిస్టులు మృతిచెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాల కోసం కుటుంబ సభ్యులు రంపచోడవరంలోని దవాఖాన వద్ద నిరీక్షిస్తున్నారు. గాజర్ల రవన్న అలియాస్ గణేష్, ఉదయ్, అరుణక్క కుటుంబ సభ్యులు హాస్పిటల్ వద్దకు బుధవారం రాత్రి 12.30 గంటలకు చేరుకున్నారు. ఇప్పటి వరకు తమకు మృతదేహాలను చూపించడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మృతదేహాలను చూపించిన తర్వాత పోస్టుమార్టం చేసి, కుటుంబ సభ్యులకు అందజేస్తామని చెప్తున్నారని, కానీ చూపించకుండా కాలం వృధా చేస్తున్నారని వాపోయారు. ఆలస్యమయ్యే కొద్దీ వారి మృతదేహాలు చెడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గాజర్ల రవన్న మృతదేహాన్ని చూపించి, పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు అందజేయడానికి గురువారం సాయంత్రం అయ్యే అవకాశాలు ఉన్నాయని, వెలిశాలకు మృతదేహాన్ని తీసుకు వచ్చేసరికి రాత్రి సమయం అయ్యేలా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.
టేకుమట్ల మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల ప్రజలు రవన్న మృతదేహాన్ని కడసారి చూడాలని ఎదురు చూస్తున్నారు. రంపచోడవరం వెళ్లిన వారిలో గాజర్ల రవన్న తమ్ముడు అశోక్, అన్న సారయ్య (ఆజాద్) కుమారుడు నవీన్, శ్రీకాకుళం జిల్లా నుంచి అరుణక్క తండ్రి లక్ష్మణరావు, సోదరి ఝాన్సీ ఉన్నారు.