సంగారెడ్డి జూన్ 30 (నమస్తే తెలంగాణ): సిగాచి ప్రమాదంలో తమ వారి వివరాలు చెప్పడం లేదంటూ అధికారులపై బాధిత కుటుంబాల సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతులు, క్షతగాత్రుల వివరాలపై కనీస సమాచారం ఇవ్వడం లేదని, ఈ ప్రభుత్వానికి తమ కన్నీరంటే విలువ లేదా అని మండిపడ్డారు. ప్రమాదం జరిగిన తర్వాత సరైన సహాయక చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం విఫలమైందంటూ బీహార్, యూపీ, ఒడిస్సా రాష్ర్టాలకు చెందిన కార్మికుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. కంపెనీ లోపలికి పంపిస్తే తమవారిని వెతుక్కుంటామని అధికారులను కోరారు. కంపెనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో, ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కనీసం మృతదేహాలను చూసేందుకు అనుమతినివ్వాలని పట్టబట్టారు. అంబులెన్స్‌లను అడ్డుకున్నారు.
సంగారెడ్డి ఆర్డీవో రవీందర్‌రెడ్డి కలుగుజేసుకుని బాధితుల వివరాలు అందజేస్తామని హామీ ఇవ్వడంతో కుటుంబసభ్యులు శాంతించారు. ఆ తర్వాత కార్మిక కుటుంబాల సభ్యులు తమ వారి సమాచారం తెలుసుకునేందుకు వీలుగా కలెక్టరేట్లో 08455-276155 నంబర్‌తో కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేశారు. తమ వారి వివరాలు తెలుసుకునేందుకు పెద్ద సంఖ్యలో కార్మికుల కుటుంబీకులు అక్కడికి చేరుకున్నారు. తన తండ్రి దాసరి రామాంజనేయులు కోసం అక్కడికి చేరుకున్న కేశవ కన్నీరుమున్నీరయ్యాడు. పటాన్‌చెరుకు చెందిన హేమలత తన భర్త నాగేశ్వర్రావు జాడ కోసం, తన భర్త పరిస్థితిపై వివరాలు తెలియడం లేదని సంజీవినిదేవి ఆవేదన వ్యక్తం చేశారు.