Crime News | మెదక్ అర్బన్: మెదక్‌లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కోర్టు భవనంపై నుంచి కుటుంబం దూకింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఇద్దరు కుమార్తెలతో కలిసి దంపతులు కోర్టు భవనంపై నుంచి కిందకు దూకారు.
ఈ ఘటనలో భార్య రమ్య తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త నవీన్‌తో పాటు ఐదు, రెండేళ్లున్న కుమార్తెలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. ముగ్గురు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా.. వారిని ఆసుపత్రికి తరలించారు. బాధితులను మెదక్ జిల్లా దౌల్తాబాద్ గ్రామసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉన్నది.
సమాచారం మేరకు.. గతేడాది అత్తగారింటిపై నవీన్ బాంబు వేయడంతో కేసు నమోదైంది. సుతిల్ బాంబు వేసిన ఘటనలో నవీన్‌పై రామాయంపేటలో కేసు నమోదు కాగా.. పుట్టింటిపై బాంబు వేసిన నుంచి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతున్నది. అత్తింటిపై బాంబు వేసిన కేసులో ఇవాళ కోర్టు విచారణకు దంపతులు హాజరయ్యారు. కోర్టు ప్రాంగణంలో మరోసారి గొడవపడి భవనంపై నుంచి కుటుంబం దూకినట్లుగా సమాచారం.