హైదరాబాద్ : చేసిన అప్పు ఓ కుటుంబం పాలిట శాపంగా మారింది. అప్పుల వాళ్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యకు(Family committed suicide) పాల్పడింది. ఈ విషాదకర సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..నిజామాబాద్ న్యాల్ కల్ రోడ్డులో నివాసం ఉండే వేణు(50) చిరు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య అనురాధ, కూతురు పూర్ణిమ (24) ఉన్నారు. కాగా, వ్యాపార నిమిత్తం స్థానిక వడ్డీ వ్యాపారులు రోషన్, వికాస్ వద్ద రెండేళ్ల కింద రూ.3 లక్షల అప్పు తీసుకున్న వేణు మొత్తానికి వడ్డీతో సహా అసలు చాలావరకు కట్టాడు.
అయినా వడ్డీ, చక్రవడ్డీల కింద జమ చేసి ఇంకా అప్పు కట్టాలని లేదంటే భార్యాకూతుళ్లను అందరిలో వివస్త్రలను చేస్తామని బెదిరించారు. దీంతో వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు తట్టుకోలేక వేణు కుటుంబం బాసర వద్ద గోదావరిలో(Godavari river) దూకారు. గమనించిన స్థానిక జాలరులు అనురాధను అతి కష్టం మీద కాపాడారు. వేణు మృతదేహం లభించింది. కూతురు పూర్ణిమ మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు.