హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): పదేండ్ల పండుగ పేరిట రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అమరవీరుల కుటుంబాలకు తీవ్ర అన్యాయం జరిగింది. వేడుకల్లో పాల్గొనాల్సిందిగా అమరులను కుటుంబాలను ఆహ్వానించిన ప్రభుత్వం ఉత్సవాల్లో కనీసం వారిని పట్టించుకోనేలేదు. తమకు కనీస గుర్తింపే లేకపాయే అని కొందరు అమరుల తల్లులు, వారి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అన్యాయంపై సభా ప్రాంగణంలోనే గళమెత్తారు. తమను పట్టించుకోరా అంటూ నిలదీశారు. అమరుల చిత్రపటాలతో తీవ్ర నిరసన తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి కనీసం అమరుల పేర్లను కూడా తలచుకోలలేదని, తమను పలుకరించలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. తమను గుర్తిస్తారని, సన్మానిస్తారని ఆశించి వచ్చామని తెలిపారు. ఇక్కడికి ఎందుకు పిలిచారో అర్థమే కావడమే లేదని అంజమ్మ అనే అమరవీరుని కుటుంబ సభ్యురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడికొచ్చిన జనాన్ని చూసేందుకా తాము వచ్చిందని ప్రశ్నించారు. కనీసం అమరుల తల్లిదండ్రులను సన్మానం కూడా చేయలేదంటూ పలువురు అసంతృప్తిని వ్యక్తంచేశారు.
అమరుల త్యాగాలకు గుర్తింపు ఏది?
మాది సంగారెడ్డి జిల్లా జోగిపేట. నా తమ్ముడు కేపీ రవీందర్‌రాజు (పిట్ల రాజు) ఓయూలో చదువుకునేవాడు. బతుకమ్మ పండుగకు ఊరికొచ్చి, సకలజనుల సమ్మె సమయంలో ఎమ్మార్వో ఆఫీసు ముందు ధర్నాలో పాల్గొని, పెట్రోల్ పోసుకుని కాల్చుకుని అమరుడయ్యాడు. కేసీఆర్ ప్రభుత్వం మాకు రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగాన్నిచ్చింది. ఇప్పడు తెలంగాణ అమరవీరులకు గుర్తింపేలేకుండా పోయింది. కాలనీలకు అమరుల పేర్లు, విగ్రహాలు, చిత్రపటాల ఏర్పాటుకు ముందుకురావాలి.
– అనిల్‌కుమార్, జోగిపేట, సంగారెడ్డి జిల్లా
ఇంటి స్థలం, పింఛన్ ఏది?
మాది నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం పెద్దగట్టు గ్రామం. మా తమ్ముడు రమావత్ నరేశ్ 2010 జనవరి 15న అమరుడయ్యాడు. నాగార్జునసాగర్ ధూంధాంలో పాల్గొని కిరోసిన్ పోసుకుని కాల్చుకుని అమరత్వం పొందాడు. మా కుటుంబానికి 2015లో 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, 2016లో ఉద్యోగమిచ్చారు. అమరుల కుటుంబాలకు స్వాతంత్య్ర సమరయోధులతో సమానంగా పింఛన్ ఇస్తమన్నరు. 200 గజాల స్థలం ఇస్తమన్నరు. అందరికీ ఒకే చోట స్థూపం కట్టిస్తామన్నరు. ఇంతవరకూ జరగలేదు.
– రమావత్ కృష్ణ, పెద్దగట్టు, నల్లగొండ జిల్లా
ఇండ్ల స్థలాలు, పింఛన్లు ఇవ్వడం లేదు
మాది నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి. మా తమ్ముడు చలమల్ల శివరాం 2012 నవంబర్ 11న అమరుడయ్యాడు. అన్ని జిల్లాల నుంచి అమరుల కుటుంబాలకు చెందినవాళ్లమంతా రాష్ర్టావతరణ వేడుకలకు వచ్చినం. అమరుల కుటుంబాలు ఇంకా దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్నాయి. ప్రభుత్వం ఇంకా ఆదుకోవాల్సి ఉన్నది. ఇండ్ల స్థలాలు, పింఛన్లు ఇంతవరకు ఇవ్వడం లేదు. నెరవేర్చాల్సిన హామీలు ఇంకా ఉన్నాయి. వాటిని నెరవేర్చాలని కోరుతున్నాం.
– చలమల్ల స్వాతి, నార్కట్‌పల్లి, నల్లగొండ జిల్లా
ఉద్యమకారులను విస్మరించారు
మాది నల్లగొండ జిల్లా దేవరకొండ. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న. పదో తరగతిలో ఉన్నప్పుడే పోరాటం చేసిన. ఎస్ఐ మోహన్‌రాజు నన్ను విపరీతంగా కొట్టిండు. రెండుసార్లు 40 రోజుల చొప్పున 80 రోజులపాటు జైలుశిక్షను అనుభవించా. మా వివరాల కోసం పోతే పోలీస్‌స్టేషన్‌లో, జైలులో రికార్డులు లేవంటున్నరు. మమ్మల్ని తెలంగాణ సమరయోధులుగా గర్తించి సర్టిఫికెట్లు ఇవ్వాలి. మాకు బస్‌పాస్, హెల్త్‌కార్డు ఇవ్వాలి. పింఛన్లు మంజూరు చేయాలి.
– దుర్గరాజు, దేవరకొండ, నల్లగొండ జిల్లా