(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు అన్నంపెట్టిన అక్షయపాత్రలాంటి కాళేశ్వరంపై రేవంత్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారం తారస్థాయికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద కక్ష సాధింపులో భాగంగా, రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడమే లక్ష్యంగా ‘కమిషన్ నివేదిక’ పేరిట రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు కొత్త నాటకానికి తెరతీసింది. మూడు పెద్ద బరాజ్‌లు, మూడు నదీగర్భ జలాశయాలు, 16 భూ ఉపరితల రిజర్వాయర్లు, 21 పంప్‌హౌస్‌లు, 20 లిఫ్టులు, 203 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు, 1,531 కిలోమీటర్ల పొడవైన కాలువలు, బాహుబలి మోటర్ల పంపుహౌస్‌లు ఇవన్నీ కలిసిన కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ కుంగితే, మొత్తం కాళేశ్వరమే కూలిపోయినట్టు కట్టుకథలు అల్లుతున్నది. సొంత కవిత్వంతో రాసిన కథనానికి ‘కమిషన్ నివేదిక’ అంటూ కలరింగ్ ఇచ్చి యావత్తూ తెలంగాణనే రేవంత్ ప్రభుత్వం తప్పుదోవ పట్టించేందుకు సిద్ధమైంది.
మోదీ, రాహుల్‌ను బాధ్యులు చేస్తారా?
పిల్లర్ కుంగింది అన్న కారణంతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టునే పడావు పెట్టి, కేసీఆర్‌ను బద్నాం చేస్తున్న రేవంత్ ప్రభుత్వం.. తమ హయాంలో కట్టిన మిగతా ప్రాజెక్టుల విషయంలోనూ ఇలాగే చేయగలదా? ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో ఎన్నో డ్యామ్‌లు పేకమేడల్లా కూలిపోయాయి. అంతెందుకు కేంద్రప్రభుత్వం జాతీయహోదా ఇచ్చి సీడబ్ల్యూసీ వెన్నుదన్నుగా నిలిచిన పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది. దీనికి ఇటు ప్రధాని మోదీని, అటు ఏపీ సీఎం చంద్రబాబును బాధ్యులమని ఒప్పుకొంటరా? గతంలో కాంగ్రెస్ హ యాంలో మొదలై.. ప్రస్తుత రేవంత్ ప్రభుత్వ హయాంలో కుప్పకూలిన ఎస్ఎల్బీసీ సొ రంగం ప్రమాదానికి కారణమెవరు? సుంకిశాల, పెద్దవాగుకు గండి, వట్టెం పంప్‌హౌస్ మునక తదితర ఘటనలకు ప్రభుత్వ పెద్దలు ఏమని సమాధానం చెప్తారు? అప్పటి భాక్రానంగల్ ప్రాజెక్టు నుంచి ఇప్పటి పోలవరం ప్రాజెక్టు వరకూ.. ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్ నుంచి రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ (యూపీ), గతంలో ఎన్నికైన వయనాడ్ (కేరళ) వరకూ ఆయా రాష్ర్టాల్లో ఎన్నో ప్రాజెక్టులు కూలినయ్. అంతెందుకు గత కాంగ్రెస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు కూడా కూలలేదా? ఇప్పుడు కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను బద్నాం చేసినట్టే, తమ పాలనలో కూలిన ప్రాజెక్టులకు కాంగ్రెస్ బాధ్యత వహిస్తుందా? విచారణ పేరిట కమిషన్లు వేస్తుందా? ఇందుకు సీఎం రేవంత్ అధిష్ఠానం పెద్దలను ఒప్పించగలరా? అని బుద్ధిజీవులు ప్రశ్నిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో కూలిన ప్రాజెక్టులు
కాంగ్రెస్ హయాంలో దశాబ్దాల కిందట కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నిన్నమొన్నటి పెద్దవాగు, వట్టెం, సుంకిశాల, ఎస్ఎల్బీసీ వరకు అన్ని ప్రాజెక్టులు కూలుడుకు కేరాఫ్‌గా నిలిచాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని పెద్దవాగు ప్రాజెక్టుకు గండి పడటమే దీనికి ఇందుకు నిదర్శనం. వరద ఉధృతంగా వస్తున్నా సకాలంలో స్పందించి ప్రాజెక్టు గేట్లు తెరవకుండా నిర్లక్ష్యం వహించడంతో ప్రాజెక్టుకు గండి పడిందని అధికారులే నిర్ధారించారు. దీంతో 16 గ్రామాలు మునిగిపోగా రూ.30 కోట్ల నష్టం వాటిల్లింది. కాంగ్రెస్ ప్రభుత్వం పడావు పెట్టిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని స్వరాష్ట్రంలో కేసీఆర్ హయాంలోనే ప్రధాన పనులన్నీ పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ కాలువను తవ్వాల్సి ఉన్నది. కానీ కాంగ్రెస్ సర్కారు ఇప్పటికీ తట్టెడు మట్టి తీయలేదు. పర్యవేక్షణ లేక నిరుడు వరదలతో పంప్‌హౌస్ మునిగింది.
కూలిన సుంకిశాల..
నాగార్జునసాగర్ నుంచి హైదరాబాద్‌కు తాగునీటి సరఫరా కోసం సుంకిశాల ప్రాజెక్టు చేపట్టారు. పంప్‌హౌస్ రిటైయినింగ్ పనులను పూర్తి చేయకుండా, ప్రాజెక్టులోకి వస్తున్న వరదను అంచనా వేయకుండానే ఇన్లెట్ వైపు సొరంగ ద్వారాన్ని కప్పి ఉంచి మట్టిని తొలగించారు. ఫలితంగా ఒక్కసారిగా నీరు సొరంగంలోకి చొచ్చుకువచ్చింది. దీంతో అవుట్లెట్ గేట్ కొట్టుకుపోవడంతోపాటు, రిటెయినింగ్ వాల్ మొత్తం కూలిపోయింది. వందల కోట్ల నష్టం వాటిల్లింది. సుంకిశాలను మూడు నెలల్లో నీటితో నింపుతానన్న రేవంత్ మాట కూడా నీటిమూటగానే మారింది.
ఎస్ఎల్బీసీ మారణహోమం
43.93 కిలోమీటర్ల ఎస్ఎల్బీసీ సొరంగం పనులను శ్రీశైలం ముఖద్వార, నల్లగొండ జిల్లా మన్యవారిపల్లె.. అలా రెండు వైపుల నుంచి ప్రారంభించారు. ఇన్‌లెట్‌లో 14 కిలోమీటర్ల వద్ద 8 మీటర్ల షియర్ జోన్ (వదులైన భూమి) ఉండి భారీ సీపేజీ వస్తున్నది. ప్రమాదకరమైన ఈ జోన్‌ను గతంలోనే గుర్తించారు. పూర్తిస్థాయిలో అధ్యయనం చేయించి సొరం గం పనులు నిర్వహించాల్సి ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అవేవీ చేయకుండా హడావుడిగా పనులు చేసింది. భారీ సీపేజీ రావడంతోపాటు, అంచనాలు తప్పి సొరంగం కుప్పకూలి 8 మంది కార్మికులు మృతిచెందారు.
శ్రీశైలం ఇలా.. నాగార్జున సాగర్ అలా
గత కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులూ గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న ఘటనలు ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టును 1981లో కాంగ్రెస్ సర్కారు నిర్మించింది. 2009లో కృష్ణానదికి వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టు ప్లంజ్‌పూల్ వద్ద 150 అడుగుల గొయ్యి ఏర్పడింది. గేట్లు విరిగిపోయాయి. ప్రాజెక్టు మనుగడే ప్రశ్నార్థకమైంది. ఇంతలో వరద బీభత్సం తగ్గడంతో ప్రాజెక్టుకు ఏమీకాలేదు. ఇక, 1967లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన నాగార్జున సాగర్‌కు కూడా 2009లో వచ్చిన వరదలు తీరని నష్టాన్నే మిగిల్చాయి. ఈ వరదలతో ప్రాజెక్టు స్పిల్‌వే డ్యామేజీ అయ్యింది. కాలువలకు గండ్లు పడ్డాయి. వీటన్నింటికీ బాధ్యత వహిస్తూ రేవంత్ ప్రభుత్వం కమిషన్ల పేరిట విచారణను ఎదుర్కోగలదా? అని బుద్ధిజీవులు ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్‌పై కక్షతోనే..
ఆధునిక భారతానికి దేవాలయమంటూ మాజీ ప్రధాని నెహ్రూ ప్రశంసించిన భాక్రానంగల్ ప్రాజెక్టు మొదలుకొని నిన్నమొన్నటి ప్రకాశం బరాజ్, పోలవరం వరకూ ప్రతిప్రాజెక్టు ఎక్కడో ఓ చోట సమస్యను ఎదుర్కొన్నదే. అయితే, మన దగ్గర కాళేశ్వరం కూలలేదు. పిల్లర్ మాత్రమే కుంగింది. ఇట్ల పిల్లర్ కుంగిందో లేదో దుష్ప్రచారం చేస్తూ రేవంత్ ప్రభుత్వం మొత్తం ప్రాజెక్టునే పడావు పెడుతున్నది. ఇలా దేశంలో సమస్య ఎదుర్కొన్న ప్రతి ప్రాజెక్టును ఇలా వదిలేస్తే ఒక్క ప్రాజెక్టు కూడా పనిచేయకుండా పోయేది. ఒక్క ఎకరాకు కూడా నీళ్లందకపోయేవి. మొత్తం దేశమే ఎడారిగా మారి ఉండేది. అసలు తెలంగాణకు కాంగ్రెస్ చేస్తున్న ద్రోహం ఏమిటంటే? మేడిగడ్డ బరాజ్‌లోని ఒక్క పిల్లర్ కుంగిందన్న కారణంతో మొత్తం కాళేశ్వరమే కూలిపోయినట్టు దుష్ప్రచారం చేసి ప్రాజెక్టును పడావు పెడ్తున్నది. కేసీఆర్‌పై ఉన్న కక్షతోనే రేవంత్ ప్రభుత్వం ఇదంతా చేస్తున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.