బీజేపీకి బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని దయనీయ పార్టీ కాంగ్రెస్. కేవలం ఆ పార్టీ చేతగాని, అసమర్థ విధానాల వల్లే బీజేపీ మనుగడ సాగిస్తున్నది. ప్రాంతీయ పార్టీలు బలంగా లేని చోట మాత్రమే బీజేపీ గెలుస్తున్నది. తన చేతగాని తనాన్ని, అసమర్థతను గుర్తించాల్సింది పోయి ప్రాంతీయ పార్టీలను ఎలా అంతం చేయాలన్న కుట్రపైనే కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది.
– కేటీఆర్
KTR | హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ) : మహారాష్ట్ర ప్రజలను మోసం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పిన అబద్ధాలను ఆ రాష్ట్ర ప్రజలు తిప్పి కొట్టి తగిన బుద్ధి చెప్పారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండానే అన్నిహామీలు అమలైనట్టు చేసిన దొంగ ప్రచారానికి కాంగ్రెస్ మూల్యం చెల్లించుకున్నదని విమర్శించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఘోర ఓటమి నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ చురకలంటించారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇకడి ప్రజలను మోసం చేస్తున్న తీరును మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని చెప్పారు. తెలంగాణలో ఏదో పొడిచేశామని రేవంత్‌రెడ్డి చేసిన అబద్ధపు ప్రచారాలను మరాఠా ప్రజలు నమ్మలేదన్నారు. రేవంత్‌రెడ్డి ప్రచారాలు, ప్రసంగాలు, బ్యాగులు, చాపర్లు అన్నీ కాంగ్రెస్‌ను ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయని దుయ్యబట్టారు. మహారాష్ట్రలో అదానీని గజదొంగగా అభివర్ణించి తెలంగాణలో అదే అదానీతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న విషయాన్ని ప్రజలు గుర్తించారని చెప్పారు. ఇకనైనా ముఖ్యమంత్రి పదవికి న్యాయం చేయాలని, తన ప్రాథమిక కర్తవ్యంపై దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సూచించారు.
ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చిన కాంగ్రెస్‌ను, ప్రాంతీయ అస్తిత్వాన్ని చులకనగా చూసిన బీజేపీని ప్రజలు తిరసరించారని కేటీఆర్ పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల నుంచే దేశంలో సంకీర్ణ శకం మొదలైందని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని చెప్పారు. జాతీయ పార్టీలకు అడ్డుగా నిలబడి రాష్ర్టాల అస్తిత్వం, అభివృద్ధి కోసం పోరాటం చేసే పార్టీలను వేధిస్తే ప్రజలే తిరగబడి బుద్ధి చెప్తారని జార్ఖండ్ నిరూపించిందన్నారు. హేమంత్ సోరెన్‌ను వేధించిన కేంద్రానికి ఈ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని తెలిపారు. జార్ఖండ్‌లో ఘన విజయం సాధించిన జేఎంఎం (జార్ఖండ్ ముక్తి మోర్చా)కు, ఆ పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాల నుంచే దేశంలో సంకీర్ణ శకం మొదలైంది. భవిష్యత్తులోనూ ఇదే ట్రెండ్ కొనసాగటం ఖాయం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సొంతంగా ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పరిస్థితిలో లేవు. ఆ రెండు పార్టీలు కలిసి దేశంలో ప్రాంతీయ పార్టీలు ఉండొద్దని కుట్రలు చేస్తున్నయి. అవి ఎన్ని కుట్రలు చేసినా ప్రాంతీయ పార్టీలను ఏమీ చేయలేవు.
-కేటీఆర్
మహారాష్ట్రలోనూ బీజేపీ గెలుపులో ప్రాంతీయ పార్టీ నేతలు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లే కీలకమయ్యారని కేటీఆర్ గుర్తుచేశారు. ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యత పెరగడం దేశ సమాఖ్య స్ఫూర్తికి, రాష్ర్టాల అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు. భవిష్యత్తులోనూ కేసీఆర్ లాంటి బలమైన ప్రాంతీయ నాయకులను ప్రజలు ఆశీర్వదించి, అండగా నిలిస్తే దేశాభివృద్ధికి, రాష్ర్టాభివృద్ధికి బాటలు పడుతాయని చెప్పారు.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటమితో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ మరింత బలహీన పడిందని కేటీఆర్ చెప్పారు. గతంలో హర్యానాలో, ఇప్పుడు మహారాష్ట్రలో గెలుస్తుందని భావించినా ఆ రెండు రాష్ర్టాల ప్రజల మనసులను కాంగ్రెస్ గెలుచుకోలేకపోయిందన్నారు. తెలంగాణ, కర్ణాటకలో మోసాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని ఉదహరించారు. ఈ ఎన్నికల ఫలితాలతో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఏమాత్రం మంచి అభిప్రాయం లేదని తేలిపోయిందన్నారు. కాంగ్రెస్ చేతగాని, అసమర్థ విధానాలే బీజేపీ బలమని, ముందుగా తనను తాను సంస్కరించుకోని కాంగ్రెస్.. ప్రాంతీయ పార్టీల అంతానికి కుట్ర చేస్తున్నదని, ఈ కుట్రలో కాంగ్రెస్ ఎకువ.. బీజేపీ తకువేం కాదని విమర్శించారు.
తెలంగాణ ప్రజలకు చెందిన రూ.300 కోట్ల సొమ్ముతో పెద్ద ఎత్తున ప్రకటనలిచ్చి తిమ్మిని బమ్మిని చేద్దామనుకున్న రేవంత్ ఆటలు మహారాష్ట్రలో సాగలేదు. తెలంగాణలో ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చకుండానే మహారాష్ట్రలో మహిళలకు రూ.3000 ఇస్తామని నయవంచన చేసే కుట్రను అక్కడి ప్రజలు గుర్తించారు.
-కేటీఆర్