కరీంనగర్, అక్టోబర్ 7 (కరీంనగర్ ప్రతినిధి): దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న ఉదాత్త ఆశయంతో అమల్లోకి తెచ్చిన దళిత బంధుపై అసత్య ప్రచారాలు చేయొద్దని ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ సూచించారు. గురువారం కరీంనగర్లో ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికల కోసం పుట్టిందని, ఎన్నికలు అయిపోగానే లబ్ధిదారుల ఖాతాల్లో వేసిన డబ్బులు వెనక్కి తీసుకుంటారని, మిగిలిన వారికి ఇవ్వరని, డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా షరతులు పెట్టారని, ఇంకా మున్ముందు షరతులు మరింత కఠినంచేస్తారని, ఎన్నికలు అయ్యాక ఎత్తేస్తారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. లబ్ధిదారులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహించారు. సీఎం కేసీఆర్ చెప్పారంటే తప్పకుండా అమలుచేస్తారన్న నమ్మకం లబ్ధిదారుల్లో ఉన్నదని చెప్పారు. కానీ, ప్రతిపక్ష నేతలు ఓట్ల కోసం దిగజారి తప్పుడు ప్రచారాలు చేస్తూ.. లబ్ధిదారులను అయోమయానికి గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. ఖాతాల్లో వేసిన డబ్బులు వాపసు తీసుకుంటారని ఈటల రాజేందర్ ప్రచారం చేస్తున్నారని, ఒకసారి ఖాతాలో వేసిన డబ్బును ఖాతాదారులు తప్ప వేరేవారు తీసుకొనే అవకాశం ఉంటుందా? ఇంకొకరు డ్రా చేసుకోవచ్చా? ఇందుకు చట్టం ఒప్పుకుంటుందా? చెప్పాలని డిమాండ్‌చేశారు. ఆర్థిక మంత్రిగా చేసిన ఈటలకు ఈ మాత్రం తెలియదా అని ప్రశ్నించారు.
ప్రతి కుటుంబానికి దళితబంధు
ప్రతి కుటుంబానికి దళిత బంధు వస్తుంది. టీఆర్ఎస్ సర్కారు ఇస్తున్న రూ.10 లక్షలకు మరో రూ.10 లక్షలు బీజేపీ ఇవ్వాలి. దళిత జాతిలో 90 శాతం మంది నిరుపేదలే. సీఎం కేసీఆర్ దళితులు అనుభవిస్తున్న బాధలను తెలుసుకుని ఈ పథకం ప్రవేశపెట్టారు. దళిత బంధుపై ఎవరికీ అనుమానాలు వద్దు. బీజేపీ ప్రచారాలను తిప్పికొట్టాలి. టీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరిన ఈటల గురించి ఆలోచించడం అనవసరం. వ్యక్తిగా అతడు ప్రజలకు అవసరం లేదు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్కే ఓటెయ్యాలి. గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించాలి.