హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జెన్కో ఇంజినీర్ల డిప్యుటేషన్ల వ్యవహారం రచ్చకెక్కింది. ఈ విషయం సీఎంవో, ఇంధనశాఖ మధ్య పంచాయితీకి దారితీసింది. తమకు సమాచారం లేకుండా సీఎంవో నుంచి ఇంజినీర్ల డిప్యుటేషన్ పొడగింపు ఉత్తర్వులు ఇవ్వడం పట్ల ఇంధనశాఖ అభ్యంతరం వ్యక్తంచేయడంతో పరిస్థితి వేడెక్కింది. వివరాల్లోకి వెలితే.. జెన్కోకు చెందిన కొందరు ఇంజినీర్లు డిప్యుటేషన్‌పై పలు విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరిలో జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న 11 మంది, హెచ్ఎండీఏలో పనిచేస్తున్న ఇద్దరు ఇంజినీర్ల డిప్యుటేషన్ కొంతకాలం క్రితం ముగిసింది. లెక్క ప్రకారం వీరంతా ఐదేండ్లు మాత్రమే డిప్యుటేషన్‌పై పనిచేయాలి. కానీ ఈ 13 మంది ఐదేండ్లు పూర్తయిన తరువాత కూడా ఎటువంటి పొడిగింపు అర్డర్లు లేకుండానే మరో ఏడాది పనిచేశారు.
ఎక్స్టెన్షన్కు ప్రయత్నాలు..
జీహెచ్ఎంసీలో పనిచేసే నలుగురు, హెచ్ఎండీఏలో పనిచేసే ఒకరు మరో ఏడాది డిప్యుటేషన్ పొడగింపునకు ప్రయత్నించారు. మిగిలిన ఎనిమిది మంది జెన్కోలో రిపోర్ట్ చేశారు. ఈ ఐదుగురి డిప్యుటేషన్ పొడిగింపునకు సంబంధించిన ఫైల్ పురపాలకశాఖ ద్వారా సీఎంవోకు చేరింది. సీఎంవో ఏ మాత్రం ఆలోచించకుండా వానిరి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఈ విషయంలో సీఎంవో ఇంధనశాఖను సంప్రదించలేదు. వాస్తవానికి డిప్యుటేషన్ పొడిగింపు ఫైల్ సీఎంవో నుంచి ఇంధనశాఖకు చేరాలి. దానిపై ఇంధనశాఖ రిమార్క్స్ రాయాల్సి ఉంటుంది. అప్పుడే డిప్యుటేషన్ గడువును పొడిగించాలి. కానీ ఇంధనశాఖకు, జెన్కోకు తెలియకుండానే సీఎంవో అధికారులు డిప్యుటేషన్ పొడిగించడమే కాకుండా కనీసం ఆ సమాచారాన్ని ఇంధనశాఖకు ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
హెచ్చరికలతో విధుల్లోకి..
ఇది తెలిసి ఇంధనశాఖ ఉన్నతాధికారు లు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసిం ది. నిబంధనల అస్ర్తాన్ని బయటికి తీసి.. ‘జీవోల ప్రకారం ఐదేండ్ల కంటే ఎక్కువగా డిప్యుటేషన్ ఇవ్వలేం. పైగా అనధికారికం గా ఎలాంటి ఉత్తర్వుల్లేకుండానే అదనంగా ఏడాదిపాటు డిప్యుటేషన్‌పై కొనసాగారు. తక్షణమే రిలీవ్ అయ్యి రిపోర్ట్ చేయాలి’ అని సదరు ఇంజినీర్లకు హెచ్చరికలు పంపినట్టు సమాచారం. ఏడాది పొడిగింపు ఉత్తర్వులొచ్చిన వారు సైతం రిలీవ్ అయ్యి.. జెన్కోలో రిపోర్టు చేశారు. దీంతో సీఎం వో వ్యవహారంపై విమర్శలొస్తున్నాయి. సీఎంవోలోని అధికారులకు ఫైల్ రూటింగ్ కూడా తెలియదా..? ఈ మాత్రం అవగాహన లేని అధికారులు సీఎంవోలో పనిచేస్తున్నారా? అన్న చర్చ సచివాలయ ఉద్యోగుల్లో జోరుగా సాగుతున్నది.