యాచారం, ఫిబ్రవరి 7: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లికి చెందిన ప్రముఖ ఒగ్గు కళాకారిణి జమ్మ మల్లారి(75) తుదిశ్వాస విడిచారు. మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న శనివారం మరణించారు. ఆమె మరణ వార్త విన్న కళాకారులు, ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. సాధారణ కుటుంబంలో పుట్టిన మల్లారి నెత్తికి తలపాగా, భుజాన గొంగడి, కాలికి గజ్జకట్టి డోలు వాయిస్తూ.. చిందేసి గొంతెత్తి పాడుతూ ఒగ్గు కథ చెప్పేది. ఆమె కామరతి పాత్రలో ఒదిగిపోయి వేషం వేసి పాట ఆలపిస్తే ప్రేక్షకులు కన్నార్పకుండా చూసిన ఘటనలు కోకొల్లలు. ఆమె కట్టు, బొట్టు, మాట, పాట అచ్చం మగవారిలాగే ఉంటుంది. గోచీ కట్టుకొని, జుబ్బా వేసుకొని, తలపాగా చుట్టుకొని ఊరూర తిరుగుతూ కథలు చెప్తుంటే ఆమె మహిళ అంటే అస్సలు నమ్మేవారు కాదు.
కామరతి వేషం వేసినప్పుడు మాత్రమే సంప్రదాయ బద్ధంగా చీర కట్టుతో ఆడపడుచులా అలరించేది. కళయే ఆమె జీవితంగా, కళకే ఆమె అంకితంగా 60 ఏండ్లుగా ఒగ్గు కథకే ఊపిరి పోసిన తెలంగాణ తొలి మహిళగా ఎదిగింది. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం మల్లారి ఒగ్గు కథలను గుర్తించింది. రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారాలు-2020కి గాను రాష్ట్ర స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ, రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 2020 పురస్కారాలకు మల్లారిని ప్రత్యేకంగా గుర్తించి ఉమెన్ అచీవర్ అవార్డు అందజేసింది. 8 మార్చి 2020న రవీంద్రభారతిలో అప్పటి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, అప్పటి రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్‌గౌడ్ మల్లారికి రూ. లక్ష చెక్కు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.