హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): స్టాక్స్‌లో పెట్టుబడులు పెడితే మంచి లాభాలొస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తయారు చేసిన ఫేక్ వీడియోపై క్లిక్ చేసిన ఓ రిటైర్డ్ ఉద్యోగి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడు. హైదరాబాద్ సఫిల్‌గూడకు చెందిన బాధితుడికి సోషల్‌మీడియాలో ఒక వీడియో కనిపించింది. అందులో నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగా ఉన్న వీడియో చూశాడు. ఏఐతో తయారు చేసిన నకిలీ వీడియో అని గుర్తించలేదు. ఆ వీడియో క్లిక్ చేయడంతోనే ఆయన ఫోన్‌కు వాట్సాప్ మెసేజ్‌లు రావడం ప్రారంభమైంది.
ఆ తర్వాత వాట్సాప్ కాల్స్ చేస్తూ ప్రోక్పోట్రెండ్, క్వారంట్లో క్యాపిటల్, క్వాంట్రో ఏఐ, విగోట్రేడర్, మిర్రెక్స్ సంస్థలకు సంబంధించి స్టాక్స్ ట్రేడింగ్ ఫ్లాట్‌ఫామ్స్ ద్వారా పెట్టుబడులు పెట్టిస్తూ ఎక్కువ లాభాలు వచ్చేలా సూచనలు ఇస్తామని నమ్మించారు. బాధితుడి ఐడీ ప్రూఫ్స్ తీసుకొని సభ్యత్వం కోసం రూ.22 వేలు వసూలు చేశారు. ఆ తర్వాత లాభాలు వచ్చాయంటూ నకిలీ స్క్రీన్‌షాట్స్ పంపించారు. బాధితుడితో ఒక యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. అందులో నుంచి పలు దఫాలుగా రూ.70.90 లక్షలు పెట్టుబడి పెట్టిస్తూ స్క్రీన్‌పై భారీ లాభాలు చూపించారు. వాటిని విత్‌డ్రా చేసుకోవాలంటే మరింత డబ్బు చెల్లించాలంటూ షరతులు విధిస్తూ మోసానికి పాల్పడ్డారు. పెట్టుబడి పెట్టిన మొత్తంలో బాధితుడికి రూ.80 వేలు తిరిగి చెల్లించి, రూ.70,09,212 మోసం చేశారు. ఈ మేరకు బాధితుడు రాచకొండ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.