ఖైరతాబాద్, మే 31: ఆయిల్‌పామ్ రైతులకు సరఫరా అవుతున్న నకిలీ విత్తనాలను అరికట్టాలని తెలంగాణ ఆయిల్‌ఫెడ్ అశ్వారావుపేట జోన్ ఆయిల్‌పామ్ గ్రోవర్స్ సొసైటీ అధ్యక్షుడు తుంబూరు ఉమామహేశ్వర్ రెడ్డి కోరారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 2.10లక్షల ఎకరాల్లో 44వేల మంది రైతులు ఆయిల్‌పామ్ పంటను సాగుచేస్తున్నారని తెలిపారు.
ఆయిల్‌పామ్ పంట వేసి నష్టపోతే పరిహారం అందించేందుకు సరైన చట్టాలు లేవని ఆవేదన వ్యక్తంచేశారు. విత్తన చట్టం కోసం ప్రభుత్వం కమిటీ వేసిందని, ఆ చట్టం పరిధిలోకి ఆయిల్‌పామ్ రైతులను తీసుకురావాలని కోరారు. ఆయిల్‌ఫెడ్ ప్రైవేటీకరణకు కుట్ర జరుగుతున్నదని, రాబడి ఈ రంగాన్ని కొందరు కావాలనే అప్పులఊబిలో కూరుకుపోయేలా చేస్తున్నారని ఆరోపించారు.
ఆయిల్‌ఫెడ్‌లో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆయిల్‌పామ్ బలోపేతానికి ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో దామోదర్‌రెడ్డి, రవికుమార్, జగ్గారావు, శ్రీరాములు, మురళీ, సురేశ్, సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.