Telangana | హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో నకిలీ ఔషధాల తయారీ, సరఫరా విచ్చలవిడిగా జరుగుతున్నది. నిరుటితో పోల్చితే నకిలీ ఔషధాలు రెట్టింపైనట్టు డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) తాజాగా విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తున్నది. సాధారణ జ్వరానికి వాడే పారాసిటమాల్ మొదలుకొని క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందుల వరకు నకిలీలు పట్టుబడుతున్నట్టు వెల్లడించింది. 2023లో పరీక్షించిన 4,553 నమూనాల్లో 79 (1.73 శాతం), నిరుడు పరీక్షించిన 3,902 శాంపిళ్లలో 130 (3.33 శాతం) నకిలీవని తేల్చింది.
2024లో పట్టుబడిన నకిలీ ఔషధాలను పరిశీలిస్తే.. అక్రమార్కులు అన్ని రకాల మందులను కల్తీ చేస్తున్నట్టు స్పష్టమవుతున్నది. కొందరు ఉనికిలో లేని కంపెనీల పేర్లతో, మరికొందరు పేరున్న కంపెనీల పేరుతో నకిలీ ఔషధాలను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. మరికొందరు ఇతర రాష్ర్టాల్లో తయారైన నకిలీ ఔషధాలను తెలంగాణలోకి తీసుకొచ్చి అమ్ముతున్నట్టు తేలింది. హైదరాబాద్‌లోని మచ్చబొల్లారంలో డీసీఏ జరిపిన దాడుల్లో ‘ఆస్ట్రా జెనరిక్స్’ అనే కంపెనీ పేరుతో నకిలీ ఔషధాలు తయారు చేస్తున్నట్టు తేలింది. అసలు ఈ కంపెనీ మనుగడలోనే లేదని అధికారులు గుర్తించారు. వీళ్లు క్యాన్సర్ చికిత్సలో వాడే ఔషధాలకు నకిలీ తయారుచేసి అమ్ముతున్నట్టు నిర్ధారించారు. జూలైలో దూలపల్లిలో నిర్వహించిన దాడుల్లో ‘అబాట్’ సంస్థ పేరుతో నకిలీ ఔషధాలు తయారు చేస్తున్నట్టు గుర్తించారు.
ఇందులో పారసిటమాల్ గోలీలు కూడా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కరకపట్లలోని బయోటెక్ పార్క్‌లో ఇతర కంపెనీల పేరిట యాంటీ బయాటిక్స్ తయారు చేసి, విదేశాలకు ఎగుమతి చేస్తున్న ముఠా గుట్టును అధికారులు రట్టు చేసి, దాదాపు రూ.కోటిన్నర విలువైన మందులు సీజ్ చేశారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో విచ్చలవిడిగా నకిలీ మందులు తయారవుతున్నాయని, గతేడాది మొత్తంగా రూ.11.32 కోట్ల విలువైన నకిలీ ఔషధాలను సీజ్ చేశామని డీసీఏ వెల్లడించింది. కొందరు మెడికల్ షాపుల యజమానులు, ఆర్ఎంపీలు, డాక్టర్లు కాసుల కక్కుర్తితో రోగులకు నకిలీ ఔషధాలను అమ్ముతున్నట్టు డీసీఏ తనిఖీల్లో తేలింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని, మందుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. నకిలీ ఔషధాలను గుర్తిస్తే 18005996969 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.