Fake IAS: నేను ఐఏఎస్ ఆఫీసర్‌ను, ఇక్కడికి ఇన్చార్జి కలెక్టర్‌గా (Fake IAS) వచ్చా.. విధుల్లో చేర్చుకోండి అంటూ ఓ మహిళ కామారెడ్డి (Kamareddy) కలెక్టరేట్లో హంగామా చేసింది. తనకు ప్రభుత్వం ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యలు అప్పగించిందంటూ అదనపు కలెక్టర్‌ను కలిసిన ఆమె ఉత్తర్వులు చూపించింది. అయితే అది నకిలీదని గుర్తించిన అధికారులు ఫోలీసులకు సమాచారం అందించారు. దీంతో నకిలీ కలెక్టర్‌ను పట్టుకుని ఆమెపై చీటింగ్ కేసు నమోదుచేశారు.
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఈ నెల 2 నుంచి సెలవులో ఉన్నారు. దీంతో నిజామాబాద్ కలెక్టర్‌కు ప్రభుత్వం ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే గత మంగళవారం (నవంబర్ 4న) హైదరాబాద్ జీడిమెట్లకు చెందిన ఇస్రత్ జహన్ అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి కామారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చింది. నేరుగా కలెక్టర్ చాంబర్‌కు వెళ్లిన ఆమె.. తాను ఐఏఎస్‌నంటూ పరిచయం చేసుకున్నది. సర్వే సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో కమిషనర్‌గా పనిచేస్తున్నానని, ఆశిష్ సాంగ్వాన్ స్థానంలో ఇన్చార్జి కలెక్టర్‌గా తనను ప్రభుత్వం నియమించిందని ఉత్తర్వులను చూపింది. దీంతో అక్కడి అధికారులు ఆ పత్రాలను అదనపు కలెక్టర్ మధుమోహన్‌కు పంపించారు. దానిని ప్రభుత్వ పరిశీలనకు పంపిన తర్వాత నిర్ణయం చెబుతామని ఆయన తెలిపారు. అప్పటివరకు చాంబర్లో కూర్చున్న ఆమె వెంటనే వెళ్లిపోవడంతో ఏడీసీకి అనుమానం వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు సమాచారం అందించారు.
సీసీ ఫుటేజీని పరిశీలించిన దేవునిపల్లి పోలీసులు ఆ మహిళను తూప్రాన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ జరిపారు. ఈ సందర్భంగా రెవెన్యూశాఖ రాష్ట్ర కమిషనరేట్ నుంచి తనకు నియామకపత్రం వచ్చిందని చెప్పినట్లు తెలిపారు. అయితే 2020 నుంచి గ్రూప్స్‌కు సన్నద్ధమవుతున్నదని, తనకు ఉద్యోగం వచ్చినట్లు కుటుంబ సభ్యులను నమ్మించేందుకే ఇలా చేసినట్లు వెల్లడించారు. విచారణ కొనసాగుతున్నదని, ఆమెపై చీటింగ్, ఫోర్జరీ కేసులను నమోదు చేసినట్లు చెప్పారు.