హృషికేశ్ (పేరు మార్చాం) చురుకైన విద్యార్థి. కరీంనగర్‌లోని ఓ కార్పొరేట్ స్కూల్లో పదో తరగతి చదివి.. 9 జీపీఏ సాధించాడు. అతని తండ్రి వ్యాపారవేత్త. ఆంధ్రాకు చెందిన ఓ ప్రముఖుడు యజమానిగా ఉన్న హైదరాబాద్‌లోని జూనియర్ కాలేజీలో హృషికేశ్ చదువుతున్నాడు. ఇంటర్ పరీక్షలు జరుగుతున్నప్పుడు హృషికేశ్ కరీంనగర్‌కు చేరుకున్నాడు. పొద్దున్నే పరీక్షకు వెళ్లి.. మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇదంతా చూసి బంధువులు, స్నేహితులు ఆశ్చర్యపోయారు. అదేంటని అడగ్గా.. చదివేది హైదరాబాద్‌లోని ప్రైవేటు కాలేజీలోనే అయినా.. అడ్మిషన్ మాత్రం లోకల్ గవర్నమెంట్ కాలేజీలో అని తల్లిదండ్రులు తెలిపారు. ఈ దందా జోరుగా నడుస్తున్నట్టు తెలుస్తున్నది.
జగిత్యాల, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ఇతర విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులకు నీట్, ఎంసెట్ తర్వాత ప్రైవేట్ కాలేజీల్లోని కన్వీనర్ కోటాలో సీటు పొందితే, ఫీజు మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది. ప్రభుత్వ కాలేజీలో చదివిన బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఒక్క రూపాయి ఫీజు చెల్లించకుండానే మెడిసిన్, ఇంజినీరింగ్, ఇతర సాంకేతిక కోర్సులను చదువుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని జూనియర్ కాలేజీల్లో చదివిన విద్యార్థులకు అగ్రికల్చర్ బీఎస్సీ ప్రవేశాల్లో కూడా 15శాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. ప్రభుత్వ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు అవకాశాలు మెరుగ్గా ఉండడంతో తల్లిదండ్రులు, ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, కార్పొరేట్ కాలేజీల యజమానులు కలిసి అక్రమాలకు పాల్పడుతున్నారు.
ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్ తీసుకుని, ప్రైవేటు కాలేజీలో చదువులు కొనసాగిస్తున్నారు. పరీక్షలు మాత్రం ప్రభుత్వ కాలేజీలోనే రాస్తున్నారు. అడ్మిషన్, హాజరు విషయంలో ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు సహకరిస్తూ జేబులు నింపుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, స్టాఫ్ సభ్యులతో కార్పొరేట్ కాలేజీ వర్గాలు సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టు తెలుస్తున్నది.
అడ్మిషన్లతో పాటు మరో దందా కూడా జోరుగా నడుస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లు, ఇంటర్మీడియట్లోని కీలకమైన సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు, జవాబులతో మెనోగ్రాఫ్స్ను రూపొందించి ప్రింట్ చేయిస్తున్నారు. ఈ నోట్స్‌ను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ కాలేజీల్లోని విద్యార్థులకు విక్రయించే పనిని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు భుజానికి ఎత్తుకున్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 20నుంచి 30 మంది నోట్స్‌ను విక్రయిస్తున్నారని ప్రభుత్వ లెక్చరర్లే చెప్తున్నారు. కార్పొరేట్ కాలేజీల యజమానుల నుంచి ప్రభుత్వ ప్రిన్సిపాళ్లు, లెక్చరర్లకు ముడుపులు, నజరానాలు ముడుతున్నట్టు పేర్కొంటున్నారు. ఈనెల 31తో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు గడువు ముగుస్తున్నందున ఫేక్ అడ్మిషన్లపై ఇంటర్ బోర్డు దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.