హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ సర్కార్ రైతుభరోసాను ఓట్ల భరోసాగా మార్చేసిందా.? రైతుల అవసరాల కోసం కాకుండా తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నదా? ఎన్నికలు ఉంటేనే రైతుభరోసాకు మోక్షం లభిస్తుందా? అంటే ప్రభుత్వ చర్యలు అవుననే చెప్తున్నాయి. ప్రభుత్వం రైతుభరోసా పంపిణీపై ద్వంద్వ ప్రకటనలు చేస్తూ రైతులను అయోమయానికి గురిచేస్తున్నది. ఓవైపు శాటిలైట్ సర్వే ఆధారంగా సాగు భూములకే రైతుభరోసా ఇస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరావు ప్రకటనలు చేస్తుంటే మరోవైపు సర్కారేమో సంక్రాంతికి రైతుభరోసా ఇస్తామంటూ వత్తాసు పత్రికలకు లీకులిస్తున్నది. సర్కార్ త్వరలోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. వీలైతే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు సైతం నిర్వహించే ప్రతిపాదన ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే సర్కార్‌కు రైతులు గుర్తొచ్చినట్టు తెలుస్తున్నది. సంక్రాంతికి రైతుభరోసా అంటే మరో పదిహేను రోజులు మాత్రమే గడువుంది. ఒకవేళ ఇదే నిజమైతే కొత్త రైతుల నమోదు ప్రక్రియ చేపట్టాలి. కానీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో ఏఈవోలకు దీనిపై ఎలాంటి ఆదేశాలు అందలేదు.
వాస్తవానికి కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత యాసంగితో కలిపి ఐదు సీజన్లు వచ్చాయి. కానీ ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే సమయానికి రైతుల ఖాతాల్లో రైతుభరోసా జమచేసింది. ఎప్పుడూ లేనివిధంగా రైతులే ఆశ్చర్యపోయేలా మొన్నటి వానకాలంలో సకాలంలో రైతుభరోసా పంపిణీ చేసింది. అయితే సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే రైతుభరోసా వేసినట్టు వ్యాఖ్యలు వినిపించాయి. రైతుల ఓట్ల కోసం అప్పులు తెచ్చి మరీ రైతుభరోసా వేసింది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన చేస్తున్నది. ఈ నేపథ్యంలో రైతుల ఓట్లకు గాలం వేసేందుకు రైతుభరోసా వేయాలనే ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది.
వాస్తవానికి కాంగ్రెస్ సర్కార్ ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలకు వెళ్లకుండా ఈ సీజన్లో రైతుభరోసాలో కోతలు పెట్టాలనే ఆలోచన చేసినట్టు సమాచారం. ఈ ఆలోచనలో భాగంగానే సాగు లెక్కల కోసం శాటిలైట్ సర్వే నిర్వహించి పంటలు సాగుచేసిన భూములకే రైతుభరోసా ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనికి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రయోగాలు కూడా చేసింది. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం సాగు భూములకే రైతుభరోసా అంటూ కీలక ప్రకటనలు చేశారు. ‘రబీ సీజన్ రైతుభరోసా కోసం శాటిలైట్ ఇమేజ్ మ్యాపింగ్‌ను త్వరితగతిన పూర్తిచేసి రైతుభరోసా నిధులు త్వరగా అందించేలా చర్యలు తీసుకోవాలి’ అంటూ ఆదేశించారు.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో మూడు సీజన్లు అరకొరగా పంపిణీ చేసిన సర్కారుర్ ఒకే ఒక్కసారి పూర్తి రైతుభరోసాను రైతులకు పంపిణీ చేసింది. సర్కార్ ఏర్పడిన కొత్తలో 2023-24 యాసంగిలో రైతుల కోసం బీఆర్ఎస్ జమచేసిన రైతుబంధు నిధులను కాంట్రాక్టర్ల బిల్లుల కోసం వాడుకున్నదనే ఆరోపణలున్నాయి. దీంతో రైతులకు నాట్ల సమయంలో వేయాల్సిన రైతుబంధును మే నెలలో కోతల సమయంలో వేసింది. ఇక ఆ తర్వాత 2024-25 వానకాలం రైతుభరోసాను పూర్తిగా ఎగ్గొట్టింది. రైతులకు ఆ సీజన్లో నయా పైసా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ఇక 2024-25 యాసంగిలో మూడెకరాలు ఉన్న వారి వరకే పంపిణీ చేసి మిగిలిన రైతులకు ఎగనామం పెట్టింది. ఇక 2025-26 వానకాలంలో మాత్రం సర్పంచ్ ఎన్నికల కోసమని నాట్ల సమయంలో రైతులకు రైతుభరోసా జమ చేసింది. పస్తుత యాసంగిలో ఏం చేస్తుందోననే చర్చ జరుగుతున్నది.