‘ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఏటా జాబ్ క్యాలెండర్‌ను ప్రకటించి అమలుచేస్తాం’ ఇదీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీ. ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా అశోక్‌నగర్ వెళ్లి విద్యార్థులతో కూర్చుని కూడా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. కానీ రెండు లక్షల ఉద్యోగాల భర్తీ హామీ ఆచరణకు నోచుకోలేదు. పైగా పాత నోటిఫికేషన్లకే నియామక పత్రాలు ఇచ్చి, తామే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. హామీ ఏమైందని అడుగుతున్న నిరుద్యోగులపై లాఠీలు ఝులిపిస్తున్నది.
-హైదరాబాద్(నమస్తే తెలంగాణ)
Congress Govt | ఈ ఏడాదిలో 53 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటున్నది. అయితే కేసీఆర్ సర్కారు హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించగా కేవలం నియామక పత్రాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని తన ఖాతాలో వేసుకుంటున్నది. ఏడాదిలో టీజీపీఎస్సీ నుంచి ఒక్క కొత్త నోటిఫికేషన్ జారీ కాలేదు. ఇక గురుకుల, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డుల నుంచి ఒక్కటంటే ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు. ఆ నోటిఫికేషన్లన్నీ 2022, 2023లో వచ్చినవే. గ్రూప్-4 సహా పలు పరీక్షలను బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలోనే నిర్వహించారు. కొన్ని కోర్టు కేసుల కారణంగా నిలిచిపోగా, న్యాయస్థానాల్లో చిక్కుముడులు వీడటంతో ఇప్పుడు నియామకపత్రాలు ఇచ్చేందుకు మార్గం సుగమమైంది.
ఇత్తేసి పొత్తుకూడినట్టు.. అన్న చందంగా పాత నోటిఫికేష్లకు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని కొత్త పోస్టులు కలిపి తామే ఉద్యోగాల భర్తీ చేపట్టినట్టు చెబుతున్నది. గ్రూప్-1కు కేసీఆర్ సర్కారు 503 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా, కాంగ్రెస్ ప్రభుత్వం మరో 60 కలిపింది. 5,089 టీచర్ పోస్టులకు గతంలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వగా మరో 5,973 పోస్టులను కలిపింది. మెడికల్ పోస్టుల్లోనూ అంతే. నర్సులు, ఎంపీహెచ్ఏలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్లు వంటి నోటిఫికేసన్లలో అదనంగా కొన్ని పోస్టులు కలిపి తామ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది.
జాబ్ క్యాలెండర్‌కు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటనతో సరిపుచ్చింది. దీనిని కూడా అమలు చేయడం లేదు. క్యాలెండర్ ప్రకారం అక్టోబర్‌లో గ్రూప్-1 కొత్త నోటిఫికేషన్ రావాలి. కానీ ఇప్పటికి కూడా నోటిఫికేషన్ విడుదల కాలేదు. విద్యుత్తు సంస్థల్లో ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పరిస్థితీ అంతే. ఫలితంగా జాబ్ క్యాలెండర్ ఒక జోక్‌గా మారింది. ఇయర్ క్యాలెండర్ పూర్తికావొస్తున్నా జాబ్ క్యాలెండర్ రాలేదంటూ నిరుద్యోగులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు నిరుద్యోగులను మభ్యపెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అదే నిరుద్యోగులపై దమనకాండను సాగిస్తున్నది. పోలీసులను ఉసిగొల్పి, నిరుద్యోగుల రక్తం కండ్ల జూస్తున్నది. ప్రభుత్వ తీరుతో నిరుద్యోగుల అడ్డా అయిన అశోక్‌నగర్, సిటీ సెంట్రల్ లైబ్రరీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, గాంధీనగర్ ప్రాంతాల్లో ఇప్పుడు పోలీసులు, మఫ్టీ పోలీసుల అడ్డాగా మారింది. నిరుద్యోగులు చిన్నపాటి సమావేశం పెట్టుకుంటే వందల సంఖ్యలో పోలీసులు వాలిపోతున్నారు. ప్రెస్మీట్లో మాట్లాడే అవకాశం కల్పించడంలేదు. ఏదైనా నిరసన పిలుపు వచ్చిందంటే నిరుద్యోగులు, జేఏసీ నేతలను ఎత్తుకెళ్లడం, పోలీసు స్టేషన్లల్లో నిర్బంధించడం కాంగ్రెస్ పాలనలో పరిపాటిగా మారింది.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 2004-2014 మధ్య 24,086 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసింది. ఇందులో తెలంగాణ ఉమ్మడి పది జిల్లాల వాటా 10,080 మాత్రమే. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2014-2023 మధ్య 1,60,083 ఉద్యోగాల భర్తీ జరిగింది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాల కన్నా ఏడు రెట్లు ఎక్కువ. ఒక్క తెలంగాణలోనే భర్తీ అయిన ఉద్యోగాలతో పోల్చితే సుమారు 15 రెట్లు అధికం. అయినా కాంగ్రెస్ ఇప్పటికీ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రచారం చేస్తున్నది. కానీ అసలు లెక్కలు ప్రజాక్షేత్రంలోనే ఉన్నాయి.