Revanth Reddy | హైదరాబాద్, జూన్ 28(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా చెప్పుకొనే నల్లగొండలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం సీఎం టూర్ సాక్షిగా నేతల మధ్య వీధిపోరు బహిర్గతమైంది. దీంతో సభకు నామమాత్రంగానే జనాలు తరలిరాగా, ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి అనుచరులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం చర్చనీయాంశమైంది.
సీఎం పర్యటన అంటేనే ఎప్పటిలాగే బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్ట్ చేసిన పోలీసులు ఈసారి కాంగ్రెస్ లీడర్లను కూడా అదుపులోకి తీసుకోవడం గమనార్హం. సొంత సోదరుడు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తన నియోజకవర్గంలో నిర్వహిస్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి హాజరుకాలేదు. దీంతో పాటు ఆయన నియోజకవర్గం నుంచి ఒక్క వాహనం కూడా ఈ సభకు రాకుండా ఆయన అనుచరులు అడ్డుకున్నట్టు సమాచారం. మరోవైపు గుత్తా ప్రొటోకాల్ వివాదం, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ ఫొటో ప్రకటనల్లో, ఫ్లెక్సీల్లో లేకపోవడం తీవ్ర దుమారానికి దారితీసింది. చివరకు సభ ముగిసిందనుకున్న సమయంలో నల్లగొండ మేయర్‌తో సీఎం సెక్యూరిటీ సిబ్బంది వాదులాటతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నేతలంతా ఎవరికి వారే అన్నట్టుగా ఉండటంతో నల్లగొండలో మంత్రి వెంకట్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహించిన ఈ సభ వెలవెలబోయింది. నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాశ్‌నేతను మంత్రి వెంకట్‌రెడ్డి ముందు నుంచీ వ్యతిరేకిస్తున్నారు. సీఎం సభ జరుగుతుండగా డీసీసీ అధ్యక్షుడిని ఏకంగా వేదికపైకి రాకుండా ఆయన అనుచరులు అడ్డుకున్నట్టు తెలిసింది. వేదికపైకి వచ్చే వారి జాబితాలో ఆయన పేరు లేకపోవడంతో చివరకు సీఎంవో కలుగజేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన నియోజకవర్గ ప్రజలెవరూ ఈ సభకు రాకుండా చూసినట్టు తెలిసింది. ఆది నుంచీ సీఎం రేవంత్‌రెడ్డి పై విరుచుకుపడుతున్న ఆయన, ఈ క్రమంలోనే సీఎం సభకు హాజరవ్వలేదు. మరోవైపు ముందస్తుగా ఆయన అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం అగ్గికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. ఇప్పటికే హామీలు ఎగ్గొట్టి అభాసుపాలవుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు చీదరించుకుంటుండగా, ఇప్పుడు నేతల మధ్య విభేదాలతో అనుకున్నంత జనసమీకరణ చేయలేకపోయారు. వచ్చిన వారు కూడా సీఎం మాట్లాడకముందే వెనక్కి తిరిగి వెళ్తూ కనిపించారు.
అంతకుముందు సీఎం పర్యటనలో ప్రొటోకాల్ వివాదం అగ్గిరాజేసింది. సీఎం పర్యటన సందర్భంగా ఇచ్చిన న్యూస్ పేపర్ ప్రకటనల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ఫొటో లేకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి కోమటిరెడ్డే ఆయన ఫోటో పెట్టకుండా అడ్డుకున్నారని గుత్తా అభిమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ క్రమంలో అధికారులపై గుత్తా సీరియస్ కావడం.. నోటీసులు జారీ చేస్తానని చెప్పడంతో సీఎంవో నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. గుత్తాను చల్లబర్చడంలో భాగంగా సీఎంతో పాటు ఆయనను హెలికాప్టర్లో నల్లగొండకు తీసుకొచ్చారు. దీంతో పాటు నల్లగొండలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మంత్రి కోమటిరెడ్డి వర్గీయులు డీసీసీ అధ్యక్షుడి ప్రస్తావన లేకుండా చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్‌కు కంచుకోటగా చెప్పుకొనే నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి ఏందనేది చర్చనీయాంశమైంది. నేతల మధ్య తీవ్ర విభేదాలు సీఎం టూర్ సాక్షిగా బట్టబయలయ్యాయి. ఈ క్రమంలోనే అందరిని సముదాయిస్తూ సీఎం పర్యటించాల్సి వచ్చింది. పూర్తిస్థాయి జనసమీకరణ చేయకపోవడంతో కంగుతిన్న సీఎం ఆవేశంతో ప్రసంగించి మమా అనిపించారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా సభ సక్సెస్ చేయకపోవడం వెనుక పార్టీ ప్రస్తుత పరిస్థితి అద్దం పడుతున్నదనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లోనే జోరుగా సాగింది. మరోవైపు ఎంపీ రఘువీర్ మాట్లాడుతూ ఇద్దరు మంత్రులు వాళ్ల నియోజకవర్గాలు తప్ప, మిగతా నియోజకవర్గాల అభివృద్ధిపై శ్రద్ధ పెట్టడం లేదని బహిరంగ సభ వేదికపై వ్యాఖ్యానించడం తీవ్ర చర్చకు దారితీసింది.
సభా ప్రాంగణంలో పలువురు నేతలు నేరుగానే బాహాబాహీకి దిగినట్టు సమాచారం. నేతల మధ్య సాగిన ఈ లొల్లి చివరకు సీఎం సెక్యూరిటీ వైపునకు మళ్లింది. ముఖ్యమంత్రి వెళ్లిపోతుండగా నేతలంతా ఆయనను కలిసేందుకు వెనుకే వచ్చారు. ఈ క్రమంలో నల్లగొండ మాజీ మేయర్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డిని, పలువురు లీడర్లను సీఎం సెక్యూరిటీ సిబ్బంది తోసేశారు. దీంతో సెక్యూరిటీ సిబ్బందితో వారు వాదులాటకు దిగారు. ఈ క్రమంలో ఒకరికొకరు నెట్టేసుకున్నారు. దీంతో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది, సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లిపోగానే కాంగ్రెస్ నాయకులను పోలీసులు చెదరగొట్టారు. సొంత పార్టీ నాయకుల పైనే పోలీసులు ఇలా వ్యవహరిస్తుంటే ముఖ్య నేతలు పట్టించుకోకపోవడంపై నాయకులు, కార్యకర్తలు సీరియస్ అయ్యారు.