Sircilla | కరీంనగర్, జనవరి 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిరిసిల్ల కేంద్రంగా కక్ష సాధింపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా కేసులు నమోదవుతున్నాయి. నిబంధనల ప్రకారమే పట్టాలు పొందినా, వాటిని ఇప్పుడు తప్పుగా చూపిస్తూ, అరెస్టుల పరంపరను కొనసాగించడమే కాకుండా, గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ నాయకుల ఆదేశాలకు ఒక ఉన్నతాధికారి తలొగ్గడమే కాకుండా, క్షేత్రస్థాయి అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పుడు ఫిర్యాదు చేయిస్తున్నారన్న విమర్శలున్నాయి. మరోవైపు, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ (పీవోటీ) చట్టాన్ని గత కాంగ్రెస్ ప్రభుత్వమే అమల్లోకి తెచ్చినప్పటికీ, ఆ బురదను బీఆర్ఎస్కు అంటించే ప్రయత్నాలను అధికార పార్టీ నాయకులు చేస్తున్నారు.
రికార్డులు తారుమారైనట్టుగా గుర్తిస్తే, నిబంధనల ప్రకారం ముందుగా సదరు భూ యజమానికి నోటీసులు ఇచ్చి, విచారణ చేయాల్సి ఉంటుంది. అయితే, అధికారులు ఆచరణలో ఆ నిబంధనలను విస్మరిస్తున్నారు. ఏదోరకంగా బీఆర్ఎస్ నాయకులను లొంగదీసుకొనేందుకు అధికార పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలకు కొంతమంది అధికారులు వంత పాడుతున్నారన్న విమర్శలొస్తున్నాయి. కాంగ్రెస్ పెడుతున్న ఒత్తిళ్లకు, కేసులకు భయపడని బీఆర్ఎస్ నాయకులు.. న్యాయపరంగా తేల్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. తప్పు చేయనంతవరకు ఎవరికీ భయడాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన భరోసా మేరకు.. బీఆర్ఎస్ నాయకులు ముందుకు సాగుతున్న తీరు.. అధికార పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదు. ఈ పరిస్థితుల్లో మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టేందుకు ఫిర్యాదులు సిద్ధం చేయాలంటూ.. ఓ కాంగ్రెస్ నాయకుడు ఆదేశిస్తే.. ప్రస్తుతం అదే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తున్నది.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బొల్లి రామ్మోహన్‌పై తప్పుడు కేసు పెట్టిన విషయాన్ని ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. రామ్మోహన్ భూమికి సంబంధించిన క్రయ, విక్రయాలు అన్నీ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయి. అన్ని రకాల ఎన్వోసీలు వచ్చాయి. అయినా, తప్పుగా చూపి ఆయనపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిన వ్యవహారం, అందులో అధికారుల పాత్ర, అధికార పార్టీ నాయకుల ఒత్తిడి వంటి విషయాలను ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. ఇదే కోణంలో మరి కొంతమంది బీఆర్ఎస్ నాయకులపై కూడా కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. కేసులు నమోదైన వారిలో సురభి నవీన్‌రావు ఒకరు. నిజానికి 2004-05 నుంచి పహనీల్లో పేరు నవీన్‌రావుకు పట్టాదారు పాసుపుస్తకాలున్నాయి. అయినా.. 20 ఏండ్ల నుంచి రికార్డుల్లో ఉన్నా.. అవి తప్పుగా నమోదయ్యాయని పేర్కొంటూ తాజాగా, ఫిర్యాదు చేసి అరెస్టు చేయించారు. బీఆర్ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి సోదరుడు జిందం దేవదాసుపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు పంపారు.
జిందం చక్రపాణిని రాజకీయంగా అణగదొక్కాలన్న దురుద్దేశంతో అతని సోదరుడు జిందం దేవదాసును కేసులో ఇరికించారనే విమర్శలొస్తున్నాయి. ఇప్పటికే కొంతమందిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపగా.. వారంతా బెయిల్‌పై వచ్చారు. వీరంతా అధికార పార్టీ ఒత్తిళ్లకు లొంగకుండా, న్యాయపరంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాము అనుకున్న లక్ష్యం నెరవేరడం లేదని భావించిన అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు.. మళ్లీ అధికారులపై ఒత్తిడి పెట్టినట్టు తెలుస్తున్నది. ఆయన ఆదేశాల మేరకు కొంతమంది అధికారులు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారని సమాచారం. దశాబ్దాలుగా రికార్డుల్లో పేర్లు ఉండగా.. అవి తప్పుగా నమోదు చేసుకున్నారంటూ పెడుతున్న కేసులను నిశితంగా పరిశీలిస్తే.. అంతా రాజకీయ కక్ష ఉన్నట్టు అర్థమవుతున్నది. ఇందుకు నిదర్శనం.. సురభి నవీన్రావుతోపాటు జిందం దేవదాసు కేసులే.
ఇతని పేరు.. సురభి నవీన్‌రావు. తంగళ్లపల్లి మండలం తాడూరు గ్రామ శివారులోని సర్వే నంబర్ 1148/8 ఈఈలో నవీన్‌రావు పేరుపై మూడు ఎకరాల స్థలం ఉన్నది. 2004-05 సంవత్సరం నుంచి పహనీలో పట్టాదారుగా నమోదై నేటివరకు కొనసాగుతున్నాడు. భూ రికార్డుల ప్రక్షాళలో భాగంగా ఆయన చేసుకున్న దరఖాస్తు మేరకు.. దస్ర్తాలు, రికార్డులు పరిశీలించి పట్టాదారు పాసు పుస్తకం జారీ చేశారు. డిజిటల్ సైన్ పూర్తి చేసి ధరణిలో నమోదు చేసిన అధికారులు.. అతని పేరుపై రికార్డులను అప్డేట్ చేశారు. దాదాపు 20 ఏండ్లుగా పహనీలో కొనసాగుతున్న నవీన్‌రావుపై ఇప్పుడు కేసు నమోదు చేశారు. ఇందుకు రకరకాల కారణాలను చూపించారు. 2004-05లో ఇతనికి అసైన్డ్భూమి ఎలా ఇచ్చారో తెలియడం లేదని, అందుకు సంబంధించిన రికార్డులు లభ్యంకావడం లేదని ప్రస్తుత తహసీల్దార్ నివేదిక ఇవ్వడంతోపాటు కేసు నమోదుచేయాలని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. ఈ వ్యవహారంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ భూమికి సంబంధించి తహసీల్దార్‌కు ఎవరు ఫిర్యాదు చేశారో ఎక్కడా చెప్పలేదు. 20 ఏండ్ల క్రితం పహనీలో నమోదైన తదుపరి అనేక రికార్డులు మారుతూ.. చివరకు పట్టాదారు పుస్తకాలు కూడా జారీ అయ్యాయి. నిజానికి పహనీలో పేరు నమోదైన సమయంలో అంటే 2004-05లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉన్నది. ప్రస్తుత తహసీల్దార్ చెప్తున్నట్టుగా ఇవి తప్పుడు రికార్డులే అయితే, ఆ వ్యవహారం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినట్టే కదా? కానీ, ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్టుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదే సర్వే నంబర్ 1148/5 ఏఏలో సురభి నవీన్‌రావు తండ్రి సురభి సుధాకర్‌రావు పేరుతో 5 ఎకరాల స్థలం ఉన్నది. తమ్ముడు సురేందర్‌రావు పేరుతో కూడా సర్వే నంబర్ 1148/13/ఈ లో 3 ఎకరాల స్థలం ఉన్నది. వీరు కూడా పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఇందులో సురభి సుధాకర్‌రావుకు పాసుబుక్‌ను అధికారులు జారీ చేయలేదు. సరైన రికార్డులు లేవని తిరస్కరించారు. కానీ, సురభి నవీన్‌రావు, సోదరుడు సురేందర్‌రావుకు రికార్డులను పరిశీలించిన అనంతరమే అధికారులు పట్టాదారు పాసుపుస్తకాలు జారీచేశారు. అంతేకాదు, గత 20 ఏండ్లుగా సంబంధిత స్థలం వీరి పేరుపైనే కొనసాగుతున్నది.
నవీన్‌రావు తండ్రి సుధాకర్‌రావు నిరుడు మేలో చనిపోయారు. సుధాకర్‌రావు పేరుపై సర్వే నంబర్ 1148/5 ఏఏ లో ఐదెకరాల స్థలం ఉన్నది. అయితే, రికార్డుల స్టేటస్‌లో సంతకం చేయలేదని తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ, సుధాకర్‌రావును ఈ కేసులో ఏ-1గా చేర్చుతూ కేసు నమోదు చేసినట్టు తెలుస్తున్నది. తహసీల్దార్ తాజాగా, ఇచ్చిన ఫిర్యాదులో సుధాకర్‌రావు మరణించిన విషయాన్ని పేర్కొనలేదు. చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేయాల్సిన అవసరం లేదు. అయన పేరుపై భూమి తప్పుగా నమోదు అయితే సదరు భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. కానీ, అటువంటి ఆదేశాలు ఇచ్చిన దాఖలాలు లేవు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు సమయానికే సుధాకర్‌రావు మరణించినప్పటికీ, ఆ విషయం ఫిర్యాదులో పేర్కొనకపోవడాన్ని చూస్తే.. అధికారులు ఆఘమేఘాల మీద ఎలా ఫిర్యాదులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సురభి నవీన్‌రావు.. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు. గతంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన.. సర్పంచ్‌గా కూడా పనిచేశారు. రాజకీయంగా ప్రజల్లో మంచి పేరున్నది. తంగళ్లపల్లి మండల స్థాయిలోనూ రాజకీయంగా కీలకంగా ఉన్నారు. ప్రజల అభిమానాన్ని పొందుతున్న సదరు నాయకుడిని ఎలాగైనా లొంగదీసుకోవాలన్న ఆలోచనతోనే ఆయనపై కేసు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. అయన మాత్రం న్యాయస్థానాన్ని ఆశ్రయించి బెయిల్‌పై బయటకు వచ్చారు. న్యాయ పోరాటం చేయడానికే నిశ్చయించుకున్నారు. మరో కోణంలో చూస్తే.. నిజానికి గత 20 ఏండ్లుగా ఎందరో తహసీల్దార్లు మారారు. కలెక్టర్లు, రెవెన్యూ విభాగంలో పైనుంచి క్షేత్రస్థాయి వరకు చాలామంది అధికారులు వచ్చి వెళ్లారు. గత చరిత్రను చూస్తే.. ఈ స్థలానికి సంబంధించి ఎక్కడా అభ్యంతరాలు వ్యక్తమైన దాఖలాలు లేవు. ఎవరూ ఫిర్యాదు చేసినట్టుగా రికార్డులు లేవు. అధికారులు నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ, ప్రస్తుత తహసీల్దార్ మాత్రం పహనీలో పేరు నమోదు తప్పుగా చేశారని, కాలక్రమేనా పలు సందర్భాల్లో రికార్డులను కొంతమంది అధికారులు తారుమారుచేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే నిజమైతే, రికార్డులు మార్చిన అధికారులను ముందుగా గుర్తించాలి? ఏ సందర్భంలో మార్చారో వారి నుంచి వివరణ తీసుకోవాలి? ఆ సమయంలో పనిచేసిన అధికారుల వద్ద ఉన్న ఆధారాలేమిటో బయకు తీయాలి. నిజంగా తప్పుడు రికార్డులు సృష్టించారో లేదో ముందుగా తేల్చాలి. తహసీల్దార్ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా రికార్డుల మార్పు జరిగి ఉంటే.. అందులో నవీన్‌రావు పాత్ర ఉన్నదో లేదో తేల్చాలి. కానీ, ఇవేవీ అధికారులు పట్టించుకున్నట్టుగా కనిపించడం లేదు. ఈ వ్యవహారంలో రాజకీయ కక్షే కనిపిస్తున్నది తప్ప.. పారదర్శకత కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.
ఇతని పేరు జిందం దేవదాసు.. ఇతని పేరిట సారంపెల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 164/3లో మూడెకరాల స్థలం ఉన్నది. ఈ భూమిని కోల ఎల్లవ్వ నుంచి 2013లో కొనుగోలు చేశారు. దశాబ్దాలుగా కోల ఎల్లవ్వ పేరుతో ఈ స్థలం ఉన్నది. అమెకు పట్టాదారు పాసు పుస్తకం ఉన్నది. కోల ఎల్లవ్వ తన బిడ్డ పెండ్లి అవసరాల కోసం ఈ స్థలాన్ని విక్రయిస్తే, అమె రిక్వెస్ట్ మేరకు జిందం దేవదాసు కొనుగోలు చేశారు. అప్పటినుంచి ఆయనే మోఖాపై ఉన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా.. తన పేరును రికార్డుల్లోకి ఎక్కించాలని కోరుతూ దేవదాసు దరఖాస్తు చేసుకున్నారు. మోఖాపై పరిశీలించిన ఆనాటి రెవెన్యూ అధికారులు కోల ఎల్లవ్వ కుటుంబంతోపాటు చుట్టుపక్కల వారిని విచారించి.. అన్నీ సవ్యంగా ఉన్నాయని భావించి.. దేవదాసు పేరును రికార్డుల్లోకి ఎక్కించారు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలో అప్పటి ప్రభుత్వం కొన్ని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. శివాయి జమేదారులు (అర్హత గలిగిన అనుభవదారుడు)గా ఉన్న వారి నుంచి దరఖాస్తులు వస్తే.. (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ (పీవోటీ) చట్టం-1977లోని సెక్షన్ 4 సబ్ సెక్షన్ (1)) ప్రకారం..
సంబంధిత అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన చేసి, నిబంధనల మేరకు ఉంటే, సదరు అనుభవదారుడిని గుర్తించి హక్కులు జారీచేయాలని ఆదేశించింది. ఈ హక్కులను జారీ చేసే ముందు మెమో నంబర్ 24196/ఏఎస్ఎస్ఎన్.1(3)/ 2017-1 తేదీ:18-12-2017, సీసీఎల్ఏ రెఫరెన్స్ నంబర్ (ఏఎస్ఎస్ఎన్.1(1)/1074/2008 తేదీ: 7-3-2018ను పరిగణనలోకి తీసుకొని రికార్డులను అప్డేట్ చేస్తూ హక్కులు కల్పించాలని ఆదేశాలు వచ్చాయి. పై ఆదేశాల ప్రకారం దేవదాసుకు ఆస్తి సక్రమించి.. పట్టాదారు పాసుపుస్తకం జారీకాగా.. ప్రస్తుత తహసీల్దార్ మాత్రం.. అంతా తప్పుడు పద్ధతిలో ఆనాటి అధికారులు దేవదాసుకు హక్కులు కల్పించారని పేర్కొంటూ.. స్టేషన్లో ఫిర్యాదుచేశారు. దేవదాసు విషయంలోనూ.. రాజకీయ కక్షే కనిపిస్తున్నది. జిందం దేవదాసు.. సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కళ భర్త, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణికి సొంత సోదరుడు. జిందం చక్రపాణికి రాజకీయంగా సిరిసిల్లలో మంచి పేరున్నది. చక్రపాణి సతీమణి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఉండటం.. అధికార పార్టీకి మింగుడు పడటం లేదు. దీంతో చక్రపాణిని రాజకీయంగా అణగదొక్కడానికి జిందం దేవదాసుపై అధికార పార్టీ తన అస్త్రం ప్రయోగించిందనే విమర్శలొస్తున్నాయి.