కరీంనగర్ కార్పొరేషన్, ఏప్రిల్ 28 : కరీంనగర్ కాంగ్రెస్‌లో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీని నమ్ముకొని పనిచేసిన కార్యకర్తలకు ప్రభుత్వ, పార్టీ పదవుల్లో ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వకుండా.. కొత్తగా చేరిన వారికే పదవులు ఇస్తే ఎలా అంటూ పలువురు కార్యకర్తలు డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఎదుటే వాగ్వాదానికి దిగారు. కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో మంగళవారం కొత్తగా నియామకమైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ కోఆర్డినేటర్ చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ముఖ్యకార్యకర్తల సమావేశం, బూత్‌లెవల్ ఏజెంట్, డివిజన్ల అధ్యక్షుల నియామకం కోసం సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు భూమయ్య, గంట కల్యాణి మాట్లాడుతూ.. సమావేశాల్లో తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదంటూ వాపోయారు. దీంతో పాత నాయకులు కవిత, తిరుపతి లేచి.. మీరు పార్టీలోకి ఎప్పుడు వచ్చారంటూ వాదనకు దిగారు. ఇరువర్గాలు తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగడంతోపాటు ఒకరినొకరు తోసుకున్నారు.
పార్టీ అధికారంలో లేనప్పుడు పనిచేసిన వారిని ఎవరూ పట్టించుకోవడంలేదని, కొత్తగా వచ్చిన వారికే ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారని, ఇప్పుడు డివిజన్ అధ్యక్ష, బూత్‌లెవల్ కమిటీలో పదవులు వారికే ఇస్తే ఎలా అంటూ నిలదీశారు. జిల్లా అధ్యక్షుడు మేడిపల్లి సత్యం ఇరువర్గాలను సముదాయించారు. పార్టీ కోసం పని చేసిన వారికే పదవులు ఇస్తామని చెప్పడంతో ఇరువర్గాల మధ్య వివాదం సద్దుమణిగింది.