PM Modi | హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు ఉత్త చేతులతోనే రావడం.. ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడటం.. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు సీఎం కేసీఆర్‌పై చిల్లర కామెంట్లు చేయడం..వెళ్లిపోవడం ఇదీ కొన్నేండ్లుగా ప్రధాని మోదీ తీరు. ఇటీవల జరిగిన పర్యటనలన్నీ ఇదే పంథాలో సాగాయి. శనివారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన సభలోకూడా ఇదే సీన్ రిపీట్ అయ్యింది. గతంలోకంటే ఓ మెట్టు దిగజారింది. ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వచ్చారు.
రోడ్లు, రైల్వే, ఇతర పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. కేంద్ర సర్కారు ఆధ్వర్యంలోనే సభ నిర్వహించారు. కానీ, మోదీ దానిని ఫక్తు రాజకీయ సభగా మార్చేశారు. అభివృద్ధి పనుల పేరుతో వచ్చి తెలంగాణపై మరోసారి విషం కక్కి వెళ్లారు. రోడ్లు, రైల్వేలు, దవాఖానలు, రేషన్ బియ్యం.. ఇలా అనేక అంశాలపై దుష్ప్రచారం చేశారు. పోనీ.. చివరగా వెళ్లే సమయంలో రాష్ర్టానికి ఏవైనా కొత్త ప్రాజెక్టులు మంజూరు చేశారా? అంటే అదీ లేదు. వచ్చేటప్పుడు.. వెళ్లేటప్పుడు ఉత్తి చేతులు ఊపడం తప్ప తెలంగాణకు ప్రయోజనం శూన్యం. మొత్తంగా శనివారం నాటి సభలో మోదీ చెప్పిన అబద్ధాలు, అసలు నిజాలను ఓసారి పరిశీలిస్తే.
మోదీ అబద్ధం: 13 ఎంఎంటీఎస్ సర్వీసులను ప్రారంభించాం. ఎంఎంటీఎస్‌ను వేగంగా అభివృద్ధి చేసేందుకు ఈసారి కేంద్ర బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించాం.
అసలు వాస్తవం: ఎంఎంటీఎస్ రెండో దశలో ఐదు మార్గాల్లో ప్రాజెక్టులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం 2012-13లో నిధులు మంజూరయ్యాయి. పదేండ్లు గడుస్తున్నా నత్తనడకన పనులు సాగుతున్నాయి. రూ.816 కోట్ల నిధులు అంచనా వేశారు. ఇందులో రూ.272 కోట్లు కేంద్రం, రూ.544 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రం రూ.179 కోట్లు విడుదల చేయగా, నిరుడు నవంబర్‌లో మరో రూ.200 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకొన్నది. మిగతా రూ.165 కోట్లు కూడా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నది. కానీ.. కేంద్రం మాత్రం పనులు వేగంగా చేపట్టడం లేదు. ఈ ఏడాది రూ.600 కోట్లు కేటాయించామని చెప్తున్న కేంద్రం.. మరో రూ.300 కోట్లు ఇస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కనెక్టివిటీ ఉండేది. ఫలక్నుమానుంచి ఉందానగర్ వరకు ఆరు కిలోమీటర్ల మేర పొడిగిస్తే చాలు. సికింద్రాబాద్ – శంషాబాద్ మధ్య కనెక్టివిటీ ఏర్పడుతుంది. విమాన ప్రయాణికులే కాకుండా ఉద్యోగులు, శంషాబాద్ పరిసర ప్రాంతాల నుంచి నగరానికి కూరగాయలు, పండ్లు తెచ్చే వ్యాపారులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు తక్కువ ఖర్చులో నగరానికి రాకపోకలు సాగించే అవకాశం ఉంది. కానీ కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదు.
మోదీ అబద్ధం: ఎంఎంటీఎస్‌తో కొత్త బిజినెస్ హబ్‌లు తయారవుతాయి. కొత్త ప్రాంతాల్లో పెట్టుబడులు వస్తాయి.
అసలు నిజం: ఎంఎంటీఎస్ ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా 2003 నుంచి జంట నగరాల్లో 130 లోకల్ సర్వీసులను నడిపించారు. కరోనా పేరుతో సగానికి పైగా సర్వీసులు రద్దు చేశారు. కొనసాగిస్తున్న వాటిని కూడా శనివారం, ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో సగం సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఉన్న సర్వీసులనే రద్దు చేస్తూ.. కొత్త బిజినెస్ హబ్‌లు ప్రారంభం అవుతాయంటూ మోదీ గప్పాలు కొట్టారు. వాస్తవానికి ఎంఎంటీఎస్‌లు అన్నీ జనావాసాల మధ్య నుంచి వెళ్తాయి. అక్కడ కొత్తగా వచ్చే పెట్టుబడులు ఏమీ ఉండవు. బిజినెస్ హబ్‌లు తయారు కావు.
మోదీ అబద్ధం: 9 ఏండ్లలో హైదరాబాద్‌లో దాదాపు 70 కిలోమీటర్ల మెట్రో నెట్‌వర్క్‌ను నిర్మించాం.
అసలు వాస్తవం: మెట్రో రైలు పనులు మొదలైంది 2007లో. అంటే యూపీఏ హయాంలో. పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. కానీ ఖాతాలో వేసుకున్నది మాత్రం ప్రధాని మోదీ. మెట్రో మొదటి దశ రూ.14,100 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమైంది. ఇందులో కేంద్రం తన వాటాగా రూ.1,458 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకూ రూ.1204 కోట్లు వచ్చాయి. మిగతా రూ.254 కోట్ల బకాయిల్ని కేంద్రం నాలుగేండ్లుగా నానబెడుతూనే ఉన్నది. ప్రాజెక్టులో కేంద్రం వాటా కేవలం 10 శాతం. అదికూడా పూర్తిగా ఇవ్వలేదు. కానీ.. మొత్తం ప్రాజెక్టును తామే పూర్తిచేశామంటూ మోదీ తన ఖాతాలో వేసుకోవాలని చూడటం విడ్డూరం.
మోదీ అబద్ధం: దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు పెడుతుంటే అందులో ఒకటి తెలంగాణకు ఇచ్చాం.
అసలు నిజం: రాష్ర్టానికి టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయాలని మొదటి నుంచీ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరుతూనే ఉన్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్వయంగా అనేకసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అయినా పట్టించుకోకపోవడంతో సొంత నిధులతో వరంగల్‌లో ‘కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్’ను ఏర్పాటు చేసింది. కనీసం దీనికైనా కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని కోరినా ఇప్పటికీ రూపాయి విదిల్చలేదు. పైగా రాష్ర్టానికి టెక్స్టైల్ పార్క్‌ను మంజూరు చేస్తామని ప్రకటించారు. అది ఎక్కడ పెడతారో? ఎప్పుడు పూర్తి చేస్తారో కనీసం చెప్పలేదు.
మోదీ అబద్ధం: రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల కేంద్రం చేపడుతున్న ప్రతి అభివృద్ధి ప్రాజెక్టు ఆలస్యం అవుతున్నది. దీనివల్ల తెలంగాణ ప్రజలకు నష్టం కలుగుతున్నది.
అసలు నిజం: ఏ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదో కనీసం రెండు, మూడు ఉదాహరణలు చెప్పాలి. అప్పుడే ప్రజలు నమ్ముతారు. ఎయిమ్స్‌కు 220 ఎకరాలు, రూ.100 కోట్ల విలువైన భూములు ఇస్తే.. నాలుగున్నరేండ్ల తర్వాత శంకుస్థాపన చేశారు. మరి ఇక్కడ సహకరించనిది కేంద్రమా? రాష్ట్ర ప్రభుత్వమా?
మోదీ అబద్ధం: కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో పరిశ్రమలు, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నది.
అసలు నిజం: తెలంగాణకు మంజూరైన ఐటీఐఆర్‌ను కేంద్రం రద్దు చేసింది. రాష్ర్టానికి రావాల్సిన పరిశ్రమలను బలవంతంగానో, బెదిరించో బీజేపీ పాలిత రాష్ర్టాలకు తీసుకెళ్లాలని చూస్తున్నది. ఇప్పటికీ నిమ్జ్ మంజూరు చేయలేదు. ఇదేనా కేంద్రం చేస్తున్న పరిశ్రమల అభివృద్ధి? వ్యవసాయ రంగానికి కేంద్రం ఇస్తున్న ప్రోత్సాహం ఏమిటి? తెలంగాణలో పండే బియ్యాన్ని కొనకుండా ముప్పుతిప్పలు పెట్టడమా? పైగా నూకలు బుక్కుమని సలహా ఇవ్వడమా? రైతులకు ఇస్తున్న ఉచిత విద్యుత్తును అడ్డుకొనేందుకు ప్రయత్నించడమా? బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టుమని మెడమీద కత్తి పెట్టడమా?.
మోదీ అబద్ధం: తెలంగాణకు ఎయిమ్స్ ఇచ్చినం. ఈరోజు పనులు మొదలయ్యాయి.
అసలు నిజం: బీబీనగర్ ఎయిమ్స్‌ను కేంద్రం 2018 డిసెంబర్లో మంజూరు చేసింది. రూ.1,366 కోట్ల అంచనా వ్యయంతో పనులు మొదలయ్యాయి. పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే రూ.350 కోట్లు విడుదల చేశామని, ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెప్పింది. ఎప్పుడో మొదలైన పనులకు ప్రధాని ఇప్పుడు శంకుస్థాపన చేసి, పనులు ఈ రోజే మొదలయ్యాయని చెప్పడం విడ్డూరం.
ఎయిమ్స్ దుస్థితి ఇది..
మోదీ అబద్ధం: 21 శతాబ్దంలో భారతదేశంలోని మూలమూలనా మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం.
అసలు నిజం: ఎక్కడో మారుమూలన ఎందుకు?. ఇది హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో ఉన్న జాతీయ రహదారి. దీని దుస్థితిని చూస్తేనే కేంద్రం ఎంత పనిచేస్తుందో తెలుస్తుంది. ఉప్పల్ నుంచి నారపల్లి వరకు రూ.626.80 కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు 2018 మేలో కేంద్ర మంత్రి నితిన్గడరీ శంకుస్థాపన చేస్తే, ఐదేండ్ల వ్యవధిలో కేవలం 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. గోల్నాక-రామంతాపూర్ ైఫ్లైఓవర్ పనులు కూడా నత్తనడకనే సాగుతున్నాయి. మోదీ ప్రసంగించిన పరేడ్‌గ్రౌండ్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్, గోల్నాక-రామంతాపూర్ ైఫ్లైఓవర్ పనులను చూస్తేనే కేంద్ర సర్కారు దేశంలో మూలమూలనా కల్పించిన మౌలిక సదుపాయాలేంటో తెలిసిపోతున్నది.
మోదీ అబద్ధం: తెలంగాణలోని 40 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ఇప్పటివరకూ రూ.9 వేల కోట్లు అందించాం.
అసలు నిజం: తెలంగాణలో 2018లో సీఎం కేసీఆర్ రైతు బంధును ప్రారంభించారు. ఏటా ఎకరాకు రూ.10 వేల చొప్పున ఎంత భూమి ఉన్నా సాయం చేస్తున్నారు. ఇలా 65 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. రైతుబంధును కాపీ కొట్టి కేంద్రం 2019 ఫిబ్రవరి నుంచి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రారంభించింది. అడ్డగోలు నిబంధనలు పెట్టింది. దీంతో రాష్ట్రంలో 35 లక్షల మందికి మాత్రమే సాయం అందుతున్నది. అయినా ప్రధాని 40 లక్షలుగా చెప్పుకొన్నారు.
మోదీ అబద్ధం: దేశంలో కుటుంబ పాలన పేదల రేషన్‌ను దోచుకుంటున్నది.
అసలు నిజం: కేంద్రం ఐదు కిలోల బియ్యం ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో కిలో ఇస్తూ.. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఇస్తున్నది. పైగా తెలంగాణ ఏర్పడినప్పటినుంచీ కేంద్రం అదనంగా ఒక్క లబ్ధిదారుడిని కూడా గుర్తించలేదు. కేంద్రం పాత లెక్కల ప్రకారమే రాష్ట్రంలో 1.91 కోట్ల మందికి మాత్రమే (53 లక్షల కార్డులకు) ఐదు కిలోల బియ్యం ఇస్తున్నది. కానీ రాష్ట్రప్రభుత్వం అదనంగా మరో 96 లక్షల మందికి కలిపి ఆరు కిలోల చొప్పున బియ్యం అందజేస్తున్నది. ఇందుకోసం ఇప్పటివరకు సుమారు రూ.27 వేల కోట్లు ఖర్చు చేసింది.
మోదీ అబద్ధం: గత తొమ్మిదేండ్లలో భారత్‌లో సాధించిన అభివృద్ధి, ప్రయోజనాలు తెలంగాణకు కూడా లభించాలి.
అసలు నిజం: అవును.. ఆకాశానికి తాకిన నిత్యావసరాల ధరలు, సెంచరీ కొట్టిన పెట్రోల్, డీజిల్, వెయ్యి దాటి గుదిబండగా మారిన గ్యాస్ బండ, ఇల్లును గుల్ల చేసి, ఉపాధిని దెబ్బతీసిన పెద్దనోట్ల రద్దు.. ఇలా ఎన్నో ప్రయోజనాలు దేశ ప్రజలతోపాటు తెలంగాణ ప్రజలకు కూడా అందుతున్నాయి. ఇంకా ఇంతకన్నా మెరుగైన ప్రయోజనాలు ఏం అందిస్తారో చెప్పాలి.
మోదీ అబద్ధం: వందే భారత్ రైలు భాగ్యలక్ష్మి అమ్మవారు ఉన్న హైదరాబాద్ నగరాన్ని వేంకటేశ్వరస్వామి కొలువైన తిరుపతిని కలుపుతుంది.
అసలు నిజం: హైదరాబాద్, తిరుపతి మధ్య మొదటిసారి కనెక్టివిటీ పెరిగిందా? రెండు నగరాల మధ్య అనేక దశాబ్దాలుగా ప్రయాణ అనుబంధం ఉన్నది. పైగా.. హైదరాబాద్‌లో వందల ఏండ్ల కింద కట్టిన పురాతన ఆలయాలు ఉండగా, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని మాత్రమే ప్రస్తావించడం అంటే రెచ్చగొట్టడం కాక మరేమిటి? పైగా.. ఈ రైలుతో పేదలకు ఎంతో లబ్ధి కలుగుతుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్తున్నారు. వాస్తవానికి హైదరాబాద్ నుంచి తిరుపతికి ఇతర రైళ్లలో ప్రయాణ చార్జీలు రూ.500-600 మధ్య ఉన్నది. కానీ వందేభారత్‌లో వెళ్లాలంటే రూ.3 వేలు చెల్లించుకోవాల్సిందే. దాదాపు ఐదారు రెట్లు అధికంగా డబ్బులు గుంజుతూ.. పేదలకు ఎలా లబ్ధి చేకూర్చుతుందో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పాలి. పైగా.. తెలంగాణకు ఇచ్చింది రెండు వందేభారత్ రైళ్లు. కానీ.. దక్షిణ మధ్య రైల్వేలో ఇప్పటివరకు 86 రైళ్లను రద్దు చేశారు. 46 ప్యాసింజర్ రైళ్లను ఎక్స్‌ప్రెస్ రైళ్లుగా మార్చారు. అనేక రైళ్లలో స్లీపర్ కోచ్‌లను తగ్గించారు. ఇవన్నీ పేదలకు మంచి చేసేవా?
మోదీ అబద్ధం: తొమ్మిదేండ్లలో జాతీయ రహదారుల నిడివి డబుల్ చేశాం. 2,500 కిలోమీటర్ల నుంచి 5 వేల కిలోమీటర్లకు పెంచాం. ఇందుకోసం కేంద్రం రూ.35 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇంకా రూ.7 వేల కోట్ల పనులు సాగుతున్నాయి.
అసలు నిజం: కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేలను నిర్మించి టోల్ ట్యాక్సుల రూంపలో ప్రజల నుంచి ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేస్తున్నది. అంటే.. ప్రజలు కట్టే పన్నులతో రోడ్లు వేసి, టోల్ ద్వారా డబ్బులు సంపాదించడమే అభివృద్ధా?
మోదీ అబద్ధం: తెలంగాణ కలలు నెరవేర్చేందుకు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉన్నది.
అసలు నిజం: విభజన చట్టం ప్రకారం రావాల్సిన.. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. వెనుకబడిన జిల్లాల నిధులు విడుదల చేయలేదు. కోచ్ ఫ్యాక్టరీ పెట్టలేదు. ఉక్కు ఫ్యాక్టరీకి గతిలేదు. అసెంబ్లీ సీట్ల పెంపు మాటే లేదు. సీసీఐ పునరుద్ధరణ గాలిలో కలిసింది. మెడికల్, నర్సింగ్ కాలేజీల్లో అన్యాయం చేశారు. ఎస్సీ వర్గీకరణకు నోచుకోలేదు. పసుపు బోర్డుకు, నీతి ఆయోగ్ సిఫారసులకు దిక్కు లేదు. ఏపీకి బదలాయించిన నిధులు తిరిగి తేలేదు. జిల్లాకో నవోదయ విద్యాలయం, కేంద్ర విద్యాసంస్థలు మంజూరు చేయలేదు. పైగా.. ఐటీఐఆర్‌ను రద్దు చేశారు. నిమ్జ్ మంజూరు చేయలేదు. టెక్స్టైల్ పార్క్ ఇంకా హామీగానే మిగిలింది… ఇవన్నీ తెలంగాణ కలలు నెరవేర్చడమేనా మోదీజీ?
మోదీ అబద్ధం: దేశంలో 11 కోట్ల మంది మహిళలకు టాయిలెట్లు కట్టించినం. ఇందులో తెలంగాణలో కూడా 30 లక్షల మందికి లబ్ధి చేకూరింది.
అసలు నిజం: స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్ల తర్వాత కూడా టాయిలెట్లు కట్టించడాన్ని గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. దీనిని బట్టే దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజలకు కనీస సదుపాయాలు కల్పించలేదని అర్థమవుతున్నది.
మోదీ అబద్ధం: తొమ్మిదేండ్లలో 9 కోట్ల కుటుంబాలకు ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. తెలంగాణలో 11 లక్షల కుటుంబాలకు లబ్ధి కలిగింది.
అసలు నిజం: తొమ్మిదేండ్ల పాలనలో మహిళలకు మోదీ ఇచ్చిన నిజమైన ‘బహుమతి’ ఇదే. 2014లో గ్యాస్ సిలిండర్ ధర రూ.410 ఉండేది. ఇప్పుడు దానిని రూ.1,155కు పెంచారు. ఇందులో ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌కు రూ.200 సబ్సిడీ ఇస్తున్నట్టు కేంద్రం చెప్తున్నది. అంటే.. ఒక్కో సిలిండర్‌కు దాదాపు రూ.వెయ్యి వరకు వసూలు చేస్తున్నారు. మోదీ వచ్చినప్పటితో పోల్చితే ఉజ్వల పథకంలో ఉన్నవారికి కూడా సుమారు రెండున్నర రెట్లు అధిక భారం పడుతున్నది. అందుకే మోదీ చేతుల మీదుగా ఉజ్వల పథకం సిలిండర్ తీసుకున్న మొదటి మహిళ సైతం గ్యాస్‌ను వదిలేసి కట్టెల పొయ్యికి మారింది. ఉజ్వల పథకం సాధించిన విజయం ఇది.
మోదీ అబద్ధం: వచ్చే 25 ఏండ్లు తెలంగాణకు చాలా కీలకం. అవినీతిపరులకు దూరంగా ఉండటమే తెలంగాణ భవిష్యత్తును నిర్ధారిస్తుంది.
అసలు నిజం: తెలంగాణ ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు. రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తిగా సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని నిర్ణయించుకొన్నారు. అందుకే రెండు దఫాల్లోనూ బీఆర్ఎస్కు పట్టంగట్టారు. బీజేపీ అడ్రస్ గల్లంతు చేశారు. ఉప ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు తప్ప ఆ పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా ఉనికే లేదు. ఈ సారి ఆ తప్పు కూడా చేయబోమని, విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడిపే బీజేపీని కూకటివేళ్లతో సహా పెకిలించి బంగాళాఖాతంలో పడేయాలని నిర్ణయించుకొన్నారు.
మోదీ అబద్ధం: పరివార్వాద్, అవినీతిని వేర్వేరుగా చూడలేం.
అసలు నిజం: పరివార్వాద్ అంటే మోదీ దృష్టిలో కేవలం బంధువులేనా? కార్పొరేట్ మిత్రులు కూడానా? అదానీకి లక్షల కోట్ల ప్రజా సంపదను దోచిపెట్టడం, ప్రభుత్వ కంపెనీలను కార్పొరేట్ కంపెనీలకు అగ్గువ సగ్గువకు కట్టబెట్టడం.. ఇవన్నీ పరివార్వాద్లోకి వస్తాయో? రావో? మోదీ చెప్పాల్సి ఉంది.
మోదీ అబద్ధం: తెలంగాణలో కోటి కుటుంబాలకు బ్యాంకుల్లో జన్‌ధన్ ఖాతాలు తెరిపించాం.
అసలు నిజం: వాటివల్ల కేంద్రం నుంచి వచ్చిన లాభం ఏమిటి?. జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే రూ.15 లక్షలు వస్తాయని ఏండ్లుగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాటి గురించి చెప్తే బాగుండేది.
మోదీ అబద్ధం: తెలంగాణలో రెండున్నర లక్షల మంది చిరుద్యోగులకు, 5 లక్షల మంది వీధి వ్యాపారులకు ముద్ర రుణాలు ఇప్పించాం.
అసలు నిజం: ముద్ర రుణాల మంజూరులో జాతీయ సగటు చూస్తే 25% జనాభాకు ఇచ్చారు. కానీ.. తెలంగాణలో మాత్రం ఇప్పటివరకూ 14%మందికి మాత్రమే ఇచ్చారు. అంటే జాతీయ సగటుకు చేరాలంటే ఇంకా సుమారు 43 లక్షల మందికి రుణాలు ఇవ్వాలి
మోదీ అబద్ధం: సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మంత్రంతో పని చేస్తాం.
అసలు నిజం: మోదీ చెప్పే పాత చింతకాయ పచ్చడి డైలాగ్ ఇది. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధులు ఇవ్వకుండా, బీజేపీపాలిత రాష్ర్టాలపైనే ప్రేమ చూపిం చి, ప్రతిపక్షాల ఏలుబడిలోని రాష్ర్టాలపై కక్ష గట్టడమే మోదీ విధానమని ప్రపంచం మొత్తం తెలుసు.
మోదీ అబద్ధం: కేంద్ర ప్రభుత్వం దేశంలో 80 కోట్ల పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్నది. ఇందులో తెలంగాణకు చెందిన లక్షలాది మందికి లాభం చేకూరుతున్నది.
అసలు నిజం: కాంగ్రెస్, బీజేపీ దశాబ్దాలపాటు దేశాన్ని పాలించిన తర్వాత కూడా ప్రజలకు ఉచిత బియ్యం ఇవ్వా ల్సి రావడం సిగ్గుచేటు. సీఎం కేసీఆర్ తరుచూ చెప్పినట్టు.. దేశ విస్తీర్ణంలో స గం అంటే.. 41 కోట్ల ఎకరాల భూమి సాగుకు యోగ్యంగా ఉన్నది. అన్ని పంట లు పండే శీతోష్ణస్థితి ఉన్నది. నదుల్లో 70 వేల టీఎంసీల నీరు పారుతున్నది. ఇంత సహజసంపద ఉండీ ప్రజలు ఇంకా ఉచి త బియ్యం కోసం ఎదురుచూడటం అభివృద్ధా? వారికి ఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పుకోవడం పరిపాలనా?
మోదీ అబద్ధం: కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ వ్యవస్థను తీసుకొచ్చింది. దీంతో ప్రభుత్వ సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతున్నది. కుటుంబ పాలన వల్లే గతంలో ఇలా జరగలేదు.
అసలు నిజం: పాలనలో పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ నగదు బదిలీ వ్యవస్థను అమలు చేస్తున్నది. ఆసరా పింఛన్లు మొదలు రైతు బంధు వరకు దాదాపు అన్ని రకాల పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. ఈ వ్యవస్థ మోదీయే ప్రవేశపెట్టినట్టు చెప్పుకోవడం హాస్యాస్పదం.
మోదీ అబద్ధం: అవినీతిపై పోరాడాలా వద్దా? దేశాన్ని అవినీతి నుంచి విముక్తి కలిగించాలా వద్దా? ఎంత పెద్ద వ్యక్తి అయినా అవినీతి చేస్తే చట్టాన్ని ప్రయోగించాలా.. వద్దా? తెలంగాణ ప్రజలే చెప్పాలి.
అసలు నిజం: తెలంగాణ ఒక్కటే కాదు.. దేశ ప్రజలంతా అదే కోరుకుంటున్నారు. తొమ్మిదేండ్లలో అదానీ సామ్రాజ్యం అంతలా ఎలా విస్తరించింది? విదేశాల్లో కాంట్రాక్టులు కట్టబెట్టడంలో ఎవరు అండగా నిలుస్తున్నారు? హిండెన్‌బర్గ్ నివేదిక మాటేమిటి? అక్రమంగా కార్పొరేట్ కంపెనీలకు జరుగుతున్న లబ్ధి, బ్యాంకులను ముంచి పారిపోతున్న ఆర్థిక నేరగాళ్లు.. ఇలాంటి అవినీతిపై విచారణ జరగాలనే కోరుకుంటున్నారు.
మోదీ అబద్ధం: 9 ఏండ్లలో రైల్వే బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు 17 రెట్లు పెరిగాయి. కొత్త రైల్వేలైన్లు, విద్యుదీకరణ, డబ్లింగ్ రికార్డు వేగంతో జరిగాయి. హైవే నెట్‌వర్క్‌ను విస్తరిస్తున్నం.
అసలు నిజం: వాస్తవానికి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టివిటీని పెంచడం కేంద్రం బాధ్యత. కానీ, ఇన్నేండ్లుగా రైలు కనెక్టివిటీ గురించి పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం సొంతగా సికింద్రాబాద్-సిద్దిపేట మార్గంలో చేపట్టిన రైలు మార్గం దాదాపు పూర్తవగా.. కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఎన్నికల వేళ మళ్లీ రోడ్లు, రైళ్లు అంటూ మోదీ హడావుడి చేస్తున్నారు.
Apaaaa