హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): చేయూత పింఛన్ లబ్ధిదారులు ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానంతో అష్టకష్టాలు పడుతున్నారు. పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది పాత ఫోన్లలో చేయూత మొబైల్ యాప్ సపోర్ట్ చేయకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నట్టు సిబ్బంది చెప్తున్నారు. దీంతో పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతుండగా లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటో తారీకు పోయి ఎనిమిది రోజులు దాటినా పింఛన్ కోసం నిత్యం పోస్టాఫీసులు, పంచాయతీల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తుందని వాపోతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 44.70 లక్షల మందికి చేయూత పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. వీరిలో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, డయాలసిస్ పేషేంట్లు, ఎయిడ్స్ బాధితులు ఉన్నారు. సుమారు 21.50 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల నగదు నేరుగా వారి ఖతాల్లో జమవుతుండగా, మిగిలిన 23.20 లక్షల మందికి మాత్రం బయోమెట్రిక్ విధానం ద్వారా అందజేస్తున్నారు. ఈ క్రమంలో చాలా మంది లబ్ధిదారుల వేలిముద్రలు పడటంలేదు. ఇదే అదునుగా సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. వేలాదిమంది మండల పరిషత్, కలెక్టర్ కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం ఈ నెల నుంచి ఫేస్ రికగ్నిషన్ ద్వారా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది.
సిబ్బంది పాతఫోన్లలో చేయూత పింఛన్ యాప్ పనిచేయకపోవడంతో ప్రభుత్వం 4జీ స్మార్ట్ ఫోన్లను ఇవ్వాలని నిర్ణయించింది. వచ్చే నెలలోనైనా 4జీ ఫోన్లను అందించాలని, లేకపోతే పింఛన్ల పంపిణీ కష్టతరంగా మారుతుందని సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రభుత్వం సాధ్యమైనంత త్వరగా ఫోన్లు అందజేయాలని కోరుతున్నారు.
ఫేస్ రికగ్నిషన్ ద్వారా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం చేయూత మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది వ్యక్తిగత ఫోన్లలో ఇన్స్టాల్ చేశారు. అయితే ఈ యాప్ పాతఫోన్లలో సక్రమంగా పని చేయడంలేదు. లబ్ధిదారుల ఐరిస్ క్యాప్చర్ చేసే సమయంలో తరుచూ సర్వర్ డౌన్ అవుతున్నది. దీంతో ఒక్కో లబ్ధిదారుకు పింఛన్ ఇచ్చేందుకు మూడు నుంచి ఐదు నిమిషాల సమయం పడుతున్నదని సిబ్బంది చెబుతున్నారు. తద్వారా పింఛన్ల పంపిణీ ఆలస్యమవుతుందని పేర్కొంటున్నారు. ఒకటో తారీకు పోయి ఎనిమిది రోజులు గడిచినా సుమారు 5 లక్షల మందికి పింఛన్ల పంపిణీ జరగలేదని అధికారులు చెబుతున్నారు. గంటల తరబడి క్యూలో నిలుచోవాల్సి వస్తుందని పేర్కొంటున్నారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.