కరీంనగర్ : కంటి సమస్యలతో బాధపడేవారు కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. కరీంనగర్ లోని 42వ డివిజన్ లో గురువారం రెండవ విడత కంటివెలుగును ప్రారంభించి కంటిఅద్దాలను పంపిణి చేశారు. . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని పథకాలు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో కంటివెలుగు, బస్తీ దవాఖానాలు, టీ డయాగ్నొస్టిక్స్, మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లతో దూసుకుపోతున్న తెలంగాణ పేదవాడికి అవసరమైన ప్రతీ పథకాన్ని అమలు చేస్తున్నారని వెల్లడించారు.
కంటి ఆరోగ్యం మెరుగు కోసం ప్రైవేట్ దవాఖానాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా మొత్తం ఆసుపత్రుల సిబ్బందే ప్రజల వద్దకు వచ్చి పరీక్షిస్తున్నారని తెలిపారు. కంటి సమస్యలతో పాటు కళ్లు మసకగా కనిపించినా వాటికి సంబంధించిన మందులను సైతం అందజేస్తారన్నారు . వైద్యం, ఆరోగ్య శాఖలకు కేంద్ర సహాయం లేకున్నా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని బస్తీ దవాఖానాలు, మెడికల్ కాలేజీలతో పాటు వేల కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తున్నారని తెలిపారు.
కరీంనగర్లో నాలుగు బస్తీ దవాఖాన్లను ఏర్పాటు చేసామన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న కేసీఆర్పై అందరి దీవెనలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్నన్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డివిజన్ కార్పొరేటర్ మేచినేని వనజ అశోక్ రావ్ తదితరులు పాల్గొన్నారు.