తొలుత గనులను వదులుకోవాలని బెదిరిస్తారు. ఇవ్వకుంటే వాటా అయినా ఇవ్వాలని హుకుం జారీ చేస్తారు. అదీ ఇవ్వకపోతే అధికారులను ప్రయోగిస్తారు. దారికి రాకుంటే దాడులు చేయిస్తారు. భారీ జరిమానాలు వేయించి, విద్యుత్తు కనెక్షన్లను పీకేయించి, క్వారీలు, ఇసుక ర్యాంపుల నుంచి వెళ్లే వాహనాలపైనా జరిమానాలు విధించి.. ఇతర వ్యాపారాలపైనా దాడులు చేయించి దారిలో పెట్టుకుంటారు.
Telangana | హైదరాబాద్, ఫిభ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గనులను అనకొండలు మింగుతున్నాయి. ‘చేతి’లో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డంగా క్వారీలు, క్రషర్ల మీదపడుతున్నాయి. ముందుగా బెదిరింపులతో మొదలుపెట్టి తర్వాత కేసులు, దాడులతో హడలెత్తించి ఆనక మొత్తానికే ‘హస్త’గతం చేసుకుంటున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో గనులను నడుపుతున్న యజమానులకు బాబాయ్- అబ్బాయ్ భయం పట్టుకున్నది. వీరి కన్ను తమపై పడకుండా ఉండాలని వ్యాపారులు కోటి దేవుళ్లను మొక్కుకుంటున్నారు. ఏడాది కాలంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని బాధపడుతున్న స్టోన్ క్రషర్లు, ఇసుక క్వారీల యజమానులపై బాబాయ్- అబ్బాయ్ పిడుగుల్లా పడ్డారు. ప్రణాళిక ప్రకారం గనులను వీరు చేజిక్కించుకుంటున్నారు. గని ఉన్నదని తెలియగానే దాన్ని వదులకోవాలని బెదిరించడం, లేదా వాటా అయినా ఇవ్వాలని హుకుం జారీ చేయడం, దిగిరాకుంటే అధికారులతో దాడులు చేయించడం కొన్ని నెలలుగా వారికి పరిపాటైంది.
గనులను చెరబడుతున్న వ్యవహారంలో రాష్ట్రంలో అత్యంత ముఖ్యనేత అక్క అల్లుడే సూత్రధారిగా నిలిచాడు. ఆయన కనుసన్నల్లోనే రాష్ట్ర గనులు, భూగర్భశాఖలోని కొందరు కీలక అధికారులు పనిచేస్తున్నట్టు విమర్శలు వస్తున్నాయి. అధికారుల అండ కూడా తోడవ్వడం, రాష్ట్ర స్థాయి ముఖ్యనేత తనకు అత్యంత సమీప బంధువు కావడంతో ఇప్పుడు ముఖ్యనేతకు అక్క అల్లుడు రెచ్చిపోతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా హెచ్ఎండీఏ పరిధిలోని స్టోన్ క్రషర్లు, ఇసుక క్వారీల వివరాలు తీసుకొని వాటన్నింటిని తనదారిలోకి తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. నగరం చుట్టూ సగం స్టోన్క్రషర్లను తన దారికి తెచ్చుకున్నట్టు సమాచారం. మరికొన్నింటిపై వీపరీతమైన ఒత్తిడి పెట్టినట్టు తెలుస్తున్నది. వీటన్నింటినీ తమ బినామీల పేర్లపైకి మార్చేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న సలహాదారుడు షామీర్పేట సమీపంలోని ఓ గ్రామంలో ఒక క్వారీ తీసుకున్నాడు. వాస్తవానికి ఆ ప్రాంతంలో తవ్వకాలను నిషేధించారు. ఆ గ్రామాన్ని తవ్వకాల నిషేధిత జాబితాలో పెట్టారు. కానీ ప్రభుత్వంలోని కీలక సలహాదారుడి కోసం అక్కడ నిబంధనలను సడలించారు. పర్యావరణానికి ఇబ్బందికరమని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
రాష్ట్రంలోని ముఖ్యనేత దారిలోనే అనుచరులు కూడా నడుస్తున్నారు. ఓ మంత్రి అన్న కొడుకు ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని రెండు ఇసుక క్వారీలను చెరబట్టాడు. కనీసం పెట్టుబడి ఇవ్వాలని వేడుకున్నా ఇచ్చేది లేదని తేల్చిచెప్పి మరీ వాటిని స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. నెలనెల ఏమైనా మిగిలితే మేమే పంపిస్తామని, మీరు దందా చేయవద్దని చెప్పినట్టు తెల్సింది. మానకొండూరు, హుజూరాబాద్ నియాజకవర్గాల్లోని ఇసుక ర్యాంపుల్లో ఇప్పుడు అన్న కొడుకు హవా నడుస్తున్నది. ఇక మహబూబ్‌నగర్‌లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ ఎమ్మెల్యే కథ కూడా బయటకు వచ్చింది. ఆయన తన నియోజకవర్గంలో ఉన్న ఓ క్రషర్ యజమానిని పిలిచి నెలకు ఎంతో కొంత తనకు పంపాలని, ఎమ్మెల్యే అయ్యా కదా ఖర్చులున్నాయని చెప్పాడు. ఎమ్మెల్యే చెప్పినంత ఇచ్చుకోలేనని, మాట్లాడుకుందామని యజమాని చెప్పడంతో నెల తిరక్కముందే ఆ క్రషర్ తనదేనని ఎమ్మెల్యే ప్రకటించేసుకున్నాడు. ఇదేం పద్ధతి అని ఆ వ్యాపారి అడిగితే వెంటనే గనుల శాఖ అధికారులు రంగంలోకి దిగి భారీ జరిమానాలు వేశారు. దీంతో ఇక చేసేది లేక ఆ ఎమ్మెల్యే చెప్పిన వాళ్లకు క్రషర్‌ను అప్పగించేశాడు.
నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని విమానాశ్రయానికి వెళ్లేదారిలో ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలంలో 500 టీపీహెచ్ (గంటకు 500 టన్నుల సామర్థ్యం) ఉన్న క్రషర్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం ప్రభుత్వానికి చెందిన 16 ఎకరాల భూమిని తీసుకున్నారు. ఇక్కడ పెద్దపెద్ద బండలను తీసుకొచ్చి కొట్టి నిర్మాణాలకు సరఫరా చేసేందుకు అనుగుణంగా ప్లాంట్‌ను నెలకొల్పుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 500 టీపీహెచ్ కెపాసిటీ ఉన్న క్రషర్లు లేవు. ముఖ్యనేత సొంత అన్న పర్యవేక్షణలో అక్క అల్లుడి సారథ్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత ఖరీదైన 16 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి 30 ఏళ్ల లీజుకు రాయించకుంటున్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న క్రషర్కు నిరంతరం గిరాకీ ఉండాలన్న ఉద్దేశంతో చుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న క్రషర్లన్నింటినీ ఏదో ఒకసాకుతో మూయించేస్తున్నారు. ఒక్కొక్కరిపై మోయలేనంత జరిమానాలు విధిస్తున్నారు. ఓ హేతుబద్ధత అంటూ లేకుండా జరిమానాలు విధించడంపై యజమానులు రాష్ట్ర స్థాయి అధికారులను కలిసి మొరపెట్టుకుంటున్నారు.
శంషాబాద్ సమీపంలోని మామిడిపల్లి సమీపంలో ఒకరికి స్టోన్‌క్రషర్ అనుమతి వచ్చింది. అక్కడ ఉన్న క్రషర్‌పై ముఖ్యనేత దృష్టిపడింది. వెంటనే తన అన్నను రంగంలోకి దించాడు. ఆ అన్న బెదిరింపులు మొదలుపెట్టాడు. చివరికి అధికారులను రంగంలోకి దించి ఆ వ్యాపారిని ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో ఆయన వీళ్లు చెప్పినట్టు సంతకాలు చేశారు. ఉత్తపుణ్యానికే సగానికిపైగా వాటా రాయించుకున్నారు. క్రషర్కు రూపాయి పెట్టుబడి పెట్టకుండా సగానికి పైగా వాటా రాయించుకోవడం అంటే వీళ్ల దౌర్జన్యం ఏ స్థాయిలో ఉన్నదో ఊహించుకోవచ్చు.
లకుడారం వద్ద మరో వ్యాపారికి సంబంధించిన గనిని కూడా హస్తగతం చేసుకున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో రెండు క్రషర్లు ఏర్పాటు చేశారు. వీటిని కడప జిల్లాకు చెందిన ఓ సంస్థకు ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా వీళ్లు అడ్డగోలుగా క్రషర్లు నడుపుతున్నారు. అయినా వీటి వంక గనుల శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడడంలేదు. ఇక్కడ గతంలో ఆ క్రషర్లను నడిపిన వారిని భయభ్రాంతులకు గురి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇదేమని అడిగేవారే లేరు.
దౌల్తాబాద్ మండలంలోని ఓ గని యజమాని తాను ఇవ్వలేనని, తనకు అప్పులున్నాయని, ఈసారికి వదిలిపెట్టాలని అడిగితే వదలకపోగా విద్యుత్తు అధికారులకు చెప్పి కరెంటు సరఫరా నిలిపివేయించారు. కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో ఆ వ్యాపారి అన్నీ వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఇది రాష్ట్ర ముఖ్యనేత అక్క అల్లుడి స్వాధీనంలో ఉన్నది.