హైదరాబాద్: చార్మినార్ సమీపంలోని మీర్చౌక్లో (Mirchowk) జరిగిన అగ్నిప్రమదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు బీఆర్ఎస్ బృందం అందుబాటులో ఉంటుందని చెప్పారు.
ఆదివారం తెల్లవారుజామున చార్మినార్ సమీపంలో ఉన్న గుల్జార్‌హౌస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు పది మంది మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నది. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరణించినవారిని అభిషేక్ మోడీ (30), ఆరుషి జైన్ (17), హర్షలి గుప్తా (7), షీతల్ జైన్ (37), రాజేందర్ కుమార్ (67), సుమిత్ర (65), మున్ని బాయి (72), ఇరాజ్ (2)గా గుర్తించారు. గాయపడిన వారిని ఉస్మానియా, మల్కపేట (యశోద), డీఆర్డీవో, హిమాయత్‌నగర్ అపోలో దవాఖానలకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం ధాటికి పలువురు స్పృహ కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.