Rain Alert | రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు (Rain Alert) కురుస్తున్నాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి, వాయవ్య బంగాళాఖాతంలోఅల్పపీడనం, అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు దంచికొడుతున్నాయి. గురువారం మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. ఈ నేపథ్యంలో మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలెర్జ్ జారీ చేసింది. నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి, సూర్యాపేట, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీచేసింది. మిగిలిన అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్లు జారీ చేసింది.
భారీవర్షాల నేపథ్యంలో గురువారం పలు జిల్లాల్లో పాఠశాలలకు ప్ర భుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేర కు బుధవారం పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, హనుమకొండ, జనగామ, భూపాలపల్లి, భువనగిరి జిల్లాల్లో బడులకు సెలవు ఇచ్చారు.
ఇక శుక్రవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, భద్రాద్రి-కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. శుక్రవారం మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు రెడ్ అలర్ట్ పరిధిలో ఉంటాయని పేర్కొంది.