హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ సీనియర్ నాయకుడు బీఎల్ సంతోష్, కేరళ వైద్యుడు జగ్గు కొట్టిలిల్ (జగ్గుస్వామి), న్యాయవాది శ్రీనివాస్‌లకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) జారీ చేసిన 41ఏ నోటీసుల అమలును నిలిపివేస్తూ గతంలో జారీచేసిన స్టే ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 30 వరకు పొడిగించింది.
స్టే ఉత్తర్వులు గురువారంతో ముగియనుండటంతో స్టే పొడిగించాలన్న విజ్ఞప్తిని న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ ఆమోదించారు. ఆ ముగ్గురినీ ప్రతిపాదిత నిందితులుగా చేర్చుతూ సిట్ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది. సదరు మెమోను ఏసీబీ కోర్టు కొట్టేస్తూ వెలువరించిన ఉత్తర్వులను సిట్ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై విచారణ పూర్తి చేసిన సింగిల్ జడ్జి జస్టిస్ దేవరాజు నాగార్జున్ తీర్పు వెలువరించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో సిట్ జారీ చేసిన 41ఏ నోటీసులు, లుకౌట్ నోటీసులను సవాల్ చేసిన కేసులో మరో న్యాయమూర్తి స్టే ఉత్తర్వులను పొడిగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేశారు.