సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 11: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతోనే సిరిసిల్లలో టెక్స్పోర్టు ఇండస్ట్రీ అందుబాటులోకి వచ్చిందని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి పేర్కొన్నారు. మహిళలకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతోనే అప్పారెల్ పార్క్లో పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్లో గల నేతన్న చౌరస్తాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. పార్టీ నాయకులు పటాకులు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ, పది వేల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా అప్పారెల్ పార్క్లో పరిశ్రమల ఏర్పాటుకు కేటీఆర్ కృషి చేశారని కొనియాడారు. గతంలోనే అప్పారెల్ పార్క్ పరిధిలో గోకుల్దాస్ కంపెనీ ఏర్పాటు ద్వారా 1,500 మంది మహిళలకు ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. బెంగళూరు తదితర రాష్ర్టాల్లో ఏర్పాటు చేయాలనుకున్న టెక్స్పోర్టు ఇండస్ట్రీ కేటీఆర్ చొరవ తీసుకుని సిరిసిల్లకు తీసుకొచ్చినట్టు తెలిపారు. 2022లోనే అప్పారెల్ పార్క్లో దాదాపు ఏడెకరాల స్థలం కేటాయించడంతోపాటు శంకుస్థాపన చేసినట్టు చెప్పారు.