NREGA Workers | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : ఉపాధి హామీ పథకం కింద చేపట్టనున్న పనుల పరిమాణం తగ్గించకుండా కేంద్రం శ్రమ దోపిడీకి పాల్పడుతున్నది. గొప్పలు చెప్పుకొనేందుకే కూలీల దినసరి వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో కార్మిక చట్టాల ప్రకారం రోజుకు సగటున రూ.300 పైగా చెల్లించామని చెప్పింది. కానీ, వాస్తవానికి సగటున కేవలం రూ.271 మాత్రమే దక్కింది. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉపాధి హామీ కూలీల రోజువారీ వేతనాన్ని రూ.300 నుంచి రూ.307కు పెంచింది. ఈ నిర్ణయంతో ఒరిగేదేమీలేదని కార్మిక సంఘాలు పెదవి విరుస్తున్నాయి. పేదలైన కూలీలకు మేలు జరుగాలంటే పనిరేటు పెంచి పని పరిణామాన్ని తగ్గించాలని పేర్కొంటున్నారు.
2024-25 ఆర్థిక సంంత్సరంలో ఉపాధి కూలీల వేతనాన్ని రూ.300గా నిర్ణయించా రు. సగటున లభించింది మాత్రం రూ.271 మాత్రమే. చెరువుల్లో పూడికతీతకు సంబంధించి ఒక క్యూబిక్ మీటర్ పనిచేయాల్సి ఉంటుంది. ఇద్దరు కూలీలు కలిసి సుమారు ఒక ట్రాక్టర్ మట్టిని ఎత్తిపోయాల్సి వస్తుంది. అప్పుడు మాత్రమే వారికి ప్రస్తుత వేతనం ప్రకారం రూ.307 దక్కుతుంది. కానీ, మండుటెండలో పొడిబారిన భూమిని తవ్వడం, ఒక్కరోజులో అంత పని పూర్తిచేయడం అసాధ్యమని కూలీలు పేర్కొంటున్నారు. ఈ పరిస్థితిలో నిరుడు నిర్ణీత కూలికి రూ.29 తక్కువగా లభించిందని చెబుతున్నారు. ఇప్పుడు కేంద్రం రూ.307 వరకు వేతనం పెంచినా ఫలితం ఉండబోదని స్పష్టం చేస్తున్నారు.
రోజువారీ పని పరిమాణాన్ని తగ్గించినప్పుడే ఉపాధి కూలీలకు లబ్ధి చేకూరుతుంది. క్యూబిక్ మీటర్‌ను 0.75 మీటర్‌కు తగ్గించాలని కోరుతున్నారు. అప్పుడే ఒక్కరోజు పనికి పూర్తివేతనం పొందే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. పని పరిమాణం తగ్గించకపోవడంతో అధికంగా కూలి లభించే వ్యవసాయం, తాపీ తదితర పనులకు వెళ్తున్నారని, వెరసి ఈ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకే ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నదని ఆరోపిస్తున్నారు.
ఉపాధి హామీ పథకం కింద వేతనం పెంచినంత మాత్రాన కూలీలకు మేలు జరుగదు. రోజువారీగా చేసే పనిని తగ్గించాలి. అప్పుడే కూలీలకు గిట్టుబాటు అవుతుంది. అలాగే 15 రోజులకోసారి వేతనాలు చెల్లించాలి. పనిచేసే ప్రాంతా ల్లో మెరుగైన వసతులు కల్పించాలి. ప్రభు త్వం ఈ దిశగా చర్యలు చేపట్టాలి. పని పరిమాణాన్ని తగ్గించి హర్యానాలో మాదిరిగా రూ.400 కూలి చెల్లించాలి.