హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): మేడ్చల్ మలాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలో ఎర్రకుంట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మ్యాప్స్ ఇన్ఫ్రాపై నమోదు చేసిన క్రిమినల్ కేసు వివరాలు ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఆక్రమణలపై నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ మ్యాప్స్ ఇన్ఫ్రా పిటిషన్ దాఖలు చేసింది. ఆ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ సీ సుధాకర్‌రెడ్డి వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ కే సుజన బుధవారం విచారించారు. తాము కొనుగోలు చేసిన భూమిలోనే నిర్మాణాలు చేపట్టామని, తప్పుడు కేసులు నమోదు చేశారని న్యాయవాది పేర్కొన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి వివరణ ఇవ్వాలంటూ బాచుపల్లి పోలీసులకు ఇరిగేషన్ శాఖ ఏఈఈకి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కొత్త టైం టేబుల్ వద్దని, పాత టైంటేబుల్‌నే అమలు చేయాలని గిరిజన గురుకుల ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని ఈనెల 28న ‘ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా గిరిజన ఉపాధ్యాయ సంఘాల నాయకులు రిషిఖేష్కుమార్, సురేందర్ రాథోడ్ మాట్లాడుతూ.. శాస్త్రీయ పద్ధతిలో ఉన్న టైంటేబుల్‌ను కాదని కొత్త టైంటేబుల్‌ను అమల్లోకి తీసుకువచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికంతటికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్య త వహించాలని స్పష్టంచేశారు. మరో 11 సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని పేర్కొన్నారు.