హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): మెడికల్ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించేందుకు మార్గదర్శకాలను ఎందుకు రూపొందించలేదో తెలియజేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కల్పనకు మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ ఈ ఏడాది జనవరి 1న కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసింది.
దీనిపై స్పందన లేకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జే శ్రీనివాసరావు ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆగస్టు 28న వినతిపత్రం సమర్పించినప్పటికీ ఫలితం లేకపోయిందని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. జాతీయ వైద్య మండలి నోటిఫికేషన్ ప్రకారం ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీ వారికి 10% రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆ ప్రస్తావనే లేకుండా ప్రవేశాలు జరుగుతున్నాయని వివరించారు. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన ధర్మాసనం.. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.