Congress Govt | మంచిర్యాల, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా కాంగ్రెస్ సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించడంలో వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. మంచిర్యాల గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బుధవారం ఫుడ్ పాయిజన్‌తో 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. అదే రోజు రాత్రి స్థానిక ప్రభుత్వ దవాఖానలో చేర్పించి గురువారం ఉదయమే డిశ్చార్జి చేశారు. పూర్తిగా నయం కాకుండానే డిశ్చార్జి చేసినట్టు ఆరోపణలు రాగా, శుక్రవారం ఇద్దరిని మరోసారి స్థానిక ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. ఫుడ్ పాయిజన్ నుంచి విద్యార్థినులు ఇంకా కోలుకోలేదని, నాలుగైదు రోజుల్లో ఇన్ఫెక్షన్ తగ్గుతుందని అధికారులు తెలిపారు.
ఫుడ్ పాయిజన్ ఘటన జరిగిన రోజు నుంచి ఆశ్రమ పాఠశాలలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నారు. శనివారం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆశ్రమ పాఠశాలలను సందర్శించారు. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి మెడికల్ క్యాంపులోని మందులను పరిశీలించగా, అందులో కాలం చెల్లిన ట్యాబ్లెట్ షీట్ కనిపించింది. వెంటనే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆ మందులను పక్కన పెట్టండని సూచించినట్టు తెలిసింది. దీనిపై కలెక్టర్ కుమార్ దీపక్, డీఎంహెచ్‌వో హరీశ్రాజ్ను వివరణ కోరగా.. ఆ మందుల విషయం తమ దృష్టికి రాలేదని పేర్కొన్నారు. బ్యాచ్ నంబర్‌ను ట్రాక్ చేసి అవి ఎవరికి ఇచ్చారు? మెడికల్ క్యాంపులో వాటిని పెట్టారా? లేదా అనే వివరాలపై విచారణ జరిపిస్తామని అన్నారు. మెడికల్ క్యాంపులో కాలం చెల్లిన మెడిసిన్ పెట్టడం ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నదని యూఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మండిపడ్డారు. అధికారులు సీరియస్‌గా తీసుకొని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.