Taj Mahal | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రపంచ వింతల్లో ఒకటైన అద్భుతమైన కట్టడం తాజ్మహల్ నిర్మాణానికి తెలంగాణ రాళ్లను వాడినట్టు నిపుణులు గుర్తించారు. కాలిఫోర్నియాలోని జెమోలాజికల్ లైబ్రరీ అండ్ రిసెర్చ్ సెంటర్ నుంచి రిటైర్డ్ లైబ్రేరియన్ డిర్లామ్, రిసెర్చ్ లైబ్రేరియన్ రోజర్స్, డైరెక్టర్ వెల్డన్ ఐదేండ్ల పాటు తాజ్మహల్ నిర్మాణంపై అధ్యయనం చేశారు.
నిర్మాణంలో వివిధ దేశాల్లోని వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, ముత్యాలు, స్ఫటికాలు, పచ్చలు వంటి ప్రత్యేక వస్తువులతో పాటు తెలంగాణలోని దేవరకొండ, మహబూబ్నగర్ నుంచి తీసుకెళ్లిన రాళ్లను వాడినట్టు గుర్తించారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో పలుగు రాళ్లు విరివిగా కనిపిస్తాయి. అందులో కొన్ని క్రిస్టల్ లక్షణాలు కలిగి ఉంటాయి. వాటిని క్రిస్టల్ క్వార్ట్గా పేర్కొంటారు. విలువైన స్ఫటికంగా పరిగణించే వీటిని కూడా నగల నగిషీల్లో వినియోగిస్తారు. వీటినే తాజ్మహల్ నిర్మాణానికి వినియోగించారని తేలింది.