(గుండాల కృష్ణ) హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 27 (నమస్తే తెలంగాణ): తెలుగు గంగ ప్రాజెక్టు.. మద్రాసు తాగునీటి కోసం మానవతా దృక్పథంతో కాగితాలపై రూపుదిద్దుకున్న ప్రాజెక్టు ఇది! మరి నిజంగా నాటి మద్రాసు నేటి చెన్నై గొంతును కృష్ణాజలాలు తడుపుతున్నయా? అలాంటప్పుడు తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పోతిరెడ్డిపాడు ద్వారా ఏటా వందలాది టీఎంసీలు ఎక్కడికి పోతున్నయి? ప్రతి సంవత్సరం చెన్నై సమీపంలోని పూంచ్కి 15 టీఎంసీలు తరలించేందుకు 1500 క్యూసెక్కుల వరద ప్రవాహంతో చేపట్టిన కాల్వలు ఇప్పుడు నదిని ఎందుకు మళ్లించుకుపోతున్నయ్? నాటి తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ‘రాష్ట్ర ప్రయోజనాలు’ అనే సోయి లేకపోవడంతోనే రాష్ట్ర రైతాంగానికి ఇప్పుడు పోతిరెడ్డిపాడు ఒక భూతంలా తయారైంది.
అయినా తెలంగాణ కాంగ్రెస్ కనీసం చరిత్ర నుంచైనా గుణపాఠాలు నేర్చుకోవడం లేదు. చంద్రబాబు రచించిన బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కమిటీని ప్రతిపాదించడమే ఇందుకు నిదర్శనం. బనకచర్లను అంగీకరించడమంటేనే తెలంగాణకు గోదావరిజలాల్లో మరణ శాసనాన్ని లిఖించడమేనన్న నోటితోనే రెండు రాష్ర్టాలతో కమిటీ వేయడమే కాదు.. మనం వేసిన కమిటీ కాబట్టి అది చెప్పినట్టు వినాలి కదా? అంటూ ముఖ్యమంత్రే తెలంగాణకు మరణశాసనాన్ని లిఖించడం మొదలుపెట్టారని సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రమైనా నదీజలాల్లో అన్యాయానికి గురికాకుండా ఉండేందుకు రాజ్యాంగం కల్పించిన రక్షణ కవచాలను ఈ కమిటీ ప్రతిపాదనతో సీఎం రేవంత్ అపహాస్యం చేశారని మండిపడుతున్నారు. సాగునీటి రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు నదీజలాలపై మనం చేసుకు న్న చట్టాలు, రూపొందించుకున్న ట్రిబ్యునళ్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నాయా?
రాజ్యాంగబద్ధమైన ట్రిబ్యునల్ ఎందుకు?
సాగునీటి రంగంలో వరదజలాలు అంటే ఎగువ నుంచి దిగువకు పొంగిపొర్లే నీళ్లు. ఈ జలాల్లో నికర జలాలు, మిగులు జలాలూ ఉంటాయి. నదుల్లో ఎగువన మొదలైన వరద ఇన్‌ఫ్లో రూపంలో ప్రాజెక్టుల్లోకి వచ్చి.. అక్కడ గేట్లు ఎత్తితే దిగువకు ప్రవహిస్తుంది. అంతిమంగా సముద్రంలో కలుస్తుంది. గోదావరి బేసిన్‌ను తీసుకుంటే 75 శాతం డిపెండబులిటీపై బేసిన్‌లోని ఏడు రాష్ర్టాలు తమ ప్రాజెక్టుల ఆధారంగా చేసుకున్న కేటాయింపులకు బచావత్ ట్రిబ్యునల్ అధికారికంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం సముద్రంలో కలిసే గోదావరిజలాల్లో 75 శాతం డిపెండబులిటీపై జరిగిన కేటాయింపులు ఉన్నాయి. అంతకంటే ఎక్కువగా కూడా ఉండొచ్చు.
కానీ అది ఎంత అనేది ఇప్పటిదాకా శాస్త్రీయంగా తేలలేదు. కృష్ణాజలాల్లో 75 శాతం డిపెండబులిటీపై బేసిన్ రాష్ర్టాలకు బచావత్ 1976లో కేటాయింపులు చేసినపుడు నీటి పరిమాణాన్ని 2,060 టీఎంసీలుగా తేల్చింది. ఆ తర్వాత బ్రిజేష్ ట్రిబ్యునల్ 65 శాతం డిపెండబులిటీపై చేసిన అధ్యయనంలో నీటి పరిమాణాన్ని 2,578 టీఎంసీలు గా చూపారు. అంటే బచావత్ (75 శాతం డిపెండబులిటీ) సమయంలో కంటే బ్రిజేష్ (65 శాతం డిపెండబులిటీ) ట్రిబ్యునల్ సమయంలో 448 టీఎంసీలు ఎక్కువగా తేలాయి. గోదావరిజలాల పంపిణీలో భాగంగా అప్పటికి అన్ని రాష్ర్టాలు చేసుకున్న ఒప్పందాలు, ఇతరత్రా సాంకేతిక అంశాలన్నింటినీ పరిగణలోనికి తీసుకుని (75 శాతం డిపెండబులిటీ) బచావత్ ఆమోద ముద్ర వేశారు.
అందులో భాగంగానే ఉమ్మడి ఏపీకి దక్కిన 1,480 టీఎంసీల గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు దక్కాయి. మరి 65 శాతం డిపెండబులిటీపై అధ్యయనం జరిగితే ఇంతకంటే ఎంత నీటి పరిమాణం ఎక్కువగా ఉందో తేలుతుంది. ఆ మేరకు కేంద్రం ట్రిబ్యునల్ వేసి.. అధ్యయనం చేసి.. నీటి పరిమాణా న్ని తేల్చితే ఆ నీటిని మిగులుజలాలుగా పరిగణించవచ్చు. కానీ ఇప్పటివరకు అదేమీ జరగలేదంటే గోదావరిలో మిగులు అనేది ఉన్నదా? లేదా? అని శాస్త్రీయంగా తేలలేదు. ఏటా 3వేల టీఎంసీల వరకు గోదావరిజలాలు సముద్రంలో కలుస్తున్నాయనేది వాస్తవమైనప్పటికీ అవి కేటాయింపుల్లోని పరిమాణమా? అంతకంటే మించినదా? అనేది శాస్త్రీయంగా తేలాలి. అందుకోస మే రాజ్యాంగబద్ధంగా కేంద్రం ట్రిబ్యునల్ వేయాలి. కానీ రెండు రాష్ర్టాల మధ్య వేసిన కమిటీ మిగులు ఉందని తేల్చితే రాజ్యాంగబద్ధమైన ట్రిబ్యునళ్లకు అర్థం లేకుండా పోతుంది. చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు నివేదికలో వరద, మిగులుజలాలు అని ప్రస్తావించారు. దీన్ని ఎత్తి చూపాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి అది చేయకపోగా కమిటీని ప్రతిపాదించారు. తద్వారా దీనిని ఆదర్శంగా తీసుకొని కేంద్ర ప్రభుత్వాలు ఏ నదీ బేసిన్లలోనైనా రెండు రాష్ర్టాలను కూర్చోబెట్టి ఓ కమిటీ వేసి మిగులుజలాల లెక్క తేల్చితే బాధిత రాష్ర్టాల గోడు వినేదెవరు?
ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ చట్టానికి అర్థమేమున్నది?
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్ర నదీ వివాదాల (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ) చట్టం-1956 రూపుదిద్దుకున్నది. ‘ఒక రాష్ట్రం చేసే చర్య ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇతర రాష్ర్టాల ప్రయోజనాలను ప్రభావితం చేస్తే అది ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ వివాదాల చట్టం-1956 చట్టం పరిధిలోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును వరద/మిగులు జలాల ఆధారంగా చేపడతామని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు చెప్తున్నారు. అంటే బేసిన్‌లోని ఏడు రాష్ర్టాలు కుదుర్చుకున్న ఒప్పందం.. బచావత్ ఆమోదం మేరకు ‘గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్-జీడబ్ల్యూడీటీ’ కేటాయించిన దాని కంటే ఎక్కువ నీటిని వాడుకునేందుకు ఏపీ సిద్ధమైంది. ఇతర ప్రాజెక్టుల ద్వారా తన కేటాయింపులను వాడుకుని, అంతకుమించిన జలాలు వాడుకునేందుకు రూపొందించిన బనకచర్లకు వరద/మిగులుజలాలను వాడుకుంటానంటున్నది.
అంటే గతంలో ఏడు రాష్ర్టాలు వేసుకున్న వాటాల కంటే ఎక్కువ వాడుకోవాలంటే అదేం తో తేల్చి… దానిని అన్ని రాష్ర్టాలకు పంచాలి. ఇప్పుడు చంద్రబాబు చెబుతున్న ఆ మిగులుజలాలు ఎంత? ఎవరి వాటా ఎంత? అని తేల్చాల్సింది ట్రిబ్యునల్ తప్ప కేంద్రం కూడా కాదు. అందుకే ఐఆర్డబ్ల్యూడీ-1956 చట్టం ప్రకారం బేసిన్‌లోని అన్ని రాష్ర్టాల అభిప్రాయాల్ని తీసుకోవాల్సిన బాధ్యత కేంద్రానిది. కానీ ఆ చట్టాన్ని తుంగలో తొక్కి కేవలం రెండు రాష్ర్టాలను పిలిచి కూర్చోబెడితే రాజ్యాంగబద్ధమైన అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టానికి అర్థమేమున్నది? కేంద్రం చట్టానికి తూట్లు పొడిస్తే ప్రశ్నించాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి దానికి ప్రత్యామ్నాయంగా కమిటీని ప్రతిపాదించారు. తద్వారా కేంద్ర ప్రభుత్వాలు నదీజలాల అంశాల్లో ఏ రాష్ర్టానికి సమస్య వచ్చినా సరే! అంతర్రాష్ట్ర నదీ వివాదాల చట్టాన్ని కాదని కమిటీ వేసి తన రాజకీయ ప్రయోజనాలకు పట్టం కడుతుంది.
ట్రిబ్యునళ్ల కేటాయింపులకు రక్షణ ఏది?
ఆయా నదీ బేసిన్లలోని రాష్ర్టాలకు జలాల పంపిణీ కోసం గతంలో కేంద్ర ప్రభుత్వాలు ట్రిబ్యునళ్లను వేశాయి. కేటాయింపుల ప్రక్రియను పూర్తి చేశాయి. వివాదాలు ఉన్నా సరే.. వాటి ప్రకారమే చాలావరకు నదీజలాల పంపిణీ కొనసాగుతున్నది. అందులో భాగంగానే కృష్ణా, గోదావరి నదీ బేసిన్లలోని రాష్ర్టాలు జలాలను వాడుకోవడంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపడుతున్నాయి. అట్లయితే ఆయా ప్రాజెక్టులకు చట్టబద్ధత వస్తుంది. ముఖ్యంగా కేంద్ర అనుమతులు, నిధులు వస్తాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వాలు ఆ మోదం తెలిపిన సాగునీటి ప్రాజెక్టులకు మొదటి ప్రామాణికత.. నికర నీటి కేటాయింపు! సంబంధిత రాష్ర్టానికి ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులకు లోబడి ఆ రాష్ట్రం ప్రాజెక్టును చేపడితేనే కేంద్ర జల సంఘం సిఫార్సు చేస్తుంది.
దాని పరిధిలోని ఇతర విభాగాలు అనుమతులిస్తాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిధులకు అంగీకరిస్తుంది. మరి.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ పొందించిన బనకచర్లకు ట్రిబ్యునల్ కేటాయింపులు ఉన్నాయా? లేవని.. అందుకు మిగులు జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టు చేపడతానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సెలవిచ్చారు. అలాంటప్పుడు ఇప్పటివరకు మిగులు జలాల ఆధారంగా కేంద్రం ఏ ఒక్క ప్రాజెక్టుకైనా అనుమతినిచ్చిందా? ఇస్తేగిస్తే బనకచర్లనే తొలి ప్రాజెక్టుగా చరిత్ర పుటల్లోకి ఎక్కుతుంది. దీంతో రాష్ర్టాలు సముద్రంలో కలిసే జలాలను చూపి కొత్త సాగునీటి ప్రాజెక్టులను నిర్మించుకుంటూ పోతే ఇతర రాష్ర్టాలకు ఉన్న ట్రిబ్యునల్ కేటాయింపులకు రక్షణ ఎలా ఉంటుంది? దేశ చరిత్రలోనే లేని కొత్త సంప్రదాయం ఎందుకు తీసుకువస్తున్నారంటూ అటు కేంద్రం, ఇటు చంద్రబాబును ప్రశ్నించాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి కమిటీని ప్రతిపాదించారు. తద్వారా ఇకముందు ఏ రాష్ట్రమైనా కేటాయింపులు లేకున్నా సముద్రంలో కలిసే నీటిని ప్రామాణికంగా తీసుకొని ప్రాజెక్టులకు అనుమతి కోరితే కేంద్ర ప్రభుత్వాలు కమిటీ వేసి వాటికి ఆమోదం తెలిపితే మిగిలిన రాష్ర్టాల అన్యాయాన్ని పట్టించుకునేదెవరు?
పునర్విభజన చట్టానికి పుట్టగతులుంటాయా?
రాజ్యాంగంలోని ఆర్టికల్-3 ప్రకారం పార్లమెంటు ఆమోదంతో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అందుకు అనుగుణంగా ఏపీ పునర్విభజన చట్టం-2014 రూపుదిద్దుకున్నది. 2014, జూన్ 2 నుంచి ఇది అమలులోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ర్టాలకు నదీజలాల అంశాలను పరిష్కరించుకునేందుకు మార్గదర్శకాలను సూచించారు. కృష్ణా, గోదావరి బేసిన్లకు సంబంధించి ఆయా నదీ యాజమాన్య బోర్డులను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే కేంద్ర జల్‌శక్తి మంత్రి అధ్యక్షతన అపెక్స్ కౌన్సిల్లో పరిష్కరించుకోవాలని పొందుపరిచారు. అయినా అన్యాయం జరిగిందని అనుకుంటే దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే వెసులుబాటు ఉన్నది.
కేవలం సమస్యల పరిష్కారమే కాదు, కొత్త సాగునీటి ప్రాజెక్టులు, జలాల పంపిణీని సైతం ఈ వేదికలపైనే పంచుకోవాలి. దీని ప్రకారం చంద్రబాబు రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టు తొలుత గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి రావాలి. ఆపై అపెక్స్‌కు వెళ్లాలి. తెలంగాణ బనకచర్లను వ్యతిరేకిస్తున్నందున రేవంత్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించే స్వేచ్ఛ కూడా ఉంది. కానీ సీఎం రేవంత్‌రెడ్డి పునర్విభజన చట్టాన్ని గౌరవించకుండా కమిటీని ప్రతిపాదించారు. తద్వారా కేంద్ర ప్రభుత్వాలు భవిష్యత్తులోనూ ఏపీ పునర్విభజన చట్టం-2014కు ప్రత్యామ్నాయంగా కమిటీలను వేసి పరిష్కారాలు చూపిస్తే.. పునర్విభజన చట్టాన్ని అమలు చేయండి అనే హక్కు తెలంగాణకు ఉంటుందా?
రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా?
కేంద్ర ప్రభుత్వం..చట్టాలు.. ట్రిబ్యునళ్లు.. ఇవన్నీ ఎలా ఉన్నా! ఏ రాజకీయ నాయకుడికైనా తన ప్రాంత ప్రయోజనాలు అనేది మొదటి ప్రాధాన్యంగా ఉండాలి. ఆ సోయి లేకపోవడంతోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలుగు గంగ కాల్వకు తలూపితే అది పోతిరెడ్డిపాడుగా తయారైంది. కనీసం అప్పటికైనా కండ్లు తెరవకుండా మంగళహారతులు పట్టడంతో ఇప్పుడు ఇంతింతై.. అన్నట్టుగా కృష్ణా నదినే చెరబడుతున్నది. నాడు కేవలం ఒక ప్రాంత నేతలు, ప్రజాప్రతినిధులే! కానీ ఇప్పుడు ప్రజలు ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు ప్రజలు వారిని ఏలికలుగా అధికారంలో కూర్చోబెట్టారు. అయినా ఈ ప్రాంత ప్రయోజనాలు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు బనకచర్లతో తెలంగాణ ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందనేది ఇప్పుడు రాష్ట్రంలో ఏ విద్యార్థిని అడిగినా.. రాజకీయ నాయకుడిని తట్టినా.. రైతులను పలకరించినా చెప్తారు.
పైగా సీఎం రేవంత్ స్వయంగా బనకచర్లను వ్యతిరేకించడమే కాకుండా ఎజెండాగా ఆ అంశం వస్తే బాయ్‌కాట్ చేస్తానన్నారు. కానీ ఇచ్చిన మాటను ఇక్కడే వదిలి విమానం ఎక్కి హస్తినలో చంద్రబాబుతో రాజీ పడ్డారు. చివరకు తెలంగాణకు కృష్ణాలో పోతిరెడ్డిపాడులా గోదావరిలో బనకచర్ల అనే గుదిబండను కట్టి మరో మరణ శాసనాన్ని లిఖించేందుకు సిద్ధమయ్యారు. బనకచర్లపై కమిటీని ప్రతిపాదించారు. తద్వారా కేంద్ర అనుమతితో ఏపీ చేపట్టే బనకచర్లకు గోదావరి నీటి కేటాయింపు అధికారికమవుతుంది. తెలంగాణ తన కేటాయింపులను వాడుకోకముందే ఏపీ తన వాటా కంటే ఎక్కువ నీటిని కూడా అధికారికంగా వాడుకునే వెసులుబాటు వస్తుంది. గోదావరి బేసిన్‌లోని ఎగువ రాష్ర్టాలు కట్టుకున్న ప్రాజెక్టుల మనుగడ సైతం ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం పొంచి ఉంది.