హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): తిరుమలలో వసతి దొరకడం లేదని తరచూ ఫిర్యాదులు అందుతుండటంతో తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వరలో తిరుపతికి తరలించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమ య్య భవనంలో ఆదివారం ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో భక్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయన దేవస్థానం చేపట్టిన పలు కార్యక్రమాలను వివరించారు. భక్తుల రద్దీ తీవ్రంగా ఉన్నపుడు తిరుమలలో గదుల లభించక భక్తులు ఇబ్బందులు పడుతున్నారని, తిరుపతిలో గదులు కేటాయించే వ్యవస్థ చేపడితే తిరుమలలో గదులు దొరకని వారు తిరుపతిలోనే బస చేస్తారన్నారు. త్వర లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. శ్రీవారి కంపార్ట్ మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే సామా న్య భక్తులకు పొద్దున త్వరగా దర్శనం అయ్యేలా వీఐపీ బ్రేక్ దర్శనాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా చేపడుతామని వివరించారు.
దేశవ్యాప్తంగా శ్రీనివాసుడి వైభవోత్సవాలు
తిరుమలలో స్వామివారికి నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వైభవోత్సవాలు నిర్వహించనున్నట్టు ఈవో చెప్పారు. అక్టోబరు 11 నుంచి 15 వరకు హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఉత్సవాలు జరుగనున్నాయన్నారు. అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుంచి 8.30 వరకు శ్రీనివాస కల్యాణం జరుగుతుందని తెలిపారు. కార్తీక మాసంలో విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామన్నారు.
బీఆర్ఎస్ను ఆశీర్వదించాలి ;శ్రీవారిని వేడుకొన్న మంత్రి కొప్పుల
తిరుమల శ్రీవారిని మంత్రి కొప్పుల ఈశ్వర్ దర్శించుకొన్నారు. ఆదివారం ఉదయం ఆలయానికి చేరిన మంత్రికి వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని శ్రీవారిని వేడుకొన్నట్టు చెప్పారు. బీఆర్ఎస్ దేశంలో 100 శాతం సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ పార్టీని దేశ ప్రజలు ఆదరిస్తే .. దేశానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. కాగా, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీజేపీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి శ్రీవారిని దర్శించుకొన్నారు.