జయశంకర్భూపాలపల్లి, జూన్ 7(నమస్తే తెలంగాణ)/మహదేవ్పూర్/మంథని రూరల్: తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి తీరుతామని, ఇందుకు అవసరమైన వనరులను సమకూర్చుకుంటామని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బరాజ్‌లను పరిశీలించారు. ఎన్డీఎస్ఏ నిబంధనల ప్రకారం నడుచుకుంటూ బరాజ్‌ల మరమ్మతు, పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, డే అండ్ నైట్ పనిచేయాలని అధికారులను, సంబంధిత ఏజెన్సీలను మంత్రి ఆదేశించారు. మేడిగడ్డలోని ఎల్అండ్టీ అతిథి గృహంలో మీడియాతో మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. రానున్న నాలుగున్నర ఏండ్లలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు నీరు అందేలా ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ఏడు లక్షల ఆయకట్టు తీసుకొస్తామని చెప్పారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి ఎల్లంపల్లికి నీటిని మళ్లిస్తామని స్పష్టంచేశారు.
ప్రస్తుతం అన్నారం, మేడిగడ్డ బరాజ్‌ల మరమ్మతు పనులను ఎల్అండ్టీ, ఆప్కాన్స్ సంస్థలు చేస్తున్నాయని తెలిపారు. ఎన్డీఎస్ఏ, ఇతర కమిటీల సూచనల మేరకు బరాజ్‌ను ఉపయోగంలోకి తీసుకొచ్చే పనులు జరుగుతున్నప్పటికీ, ఈ రెండు బరాజ్‌ల్లో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదని చెప్పారు. ఈ బరాజ్‌ల నుంచి నీటిని బయటికి వదిలేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో బరాజ్‌లపై పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయామని, అయినప్పటికీ ఎన్డీఎస్ఏతో అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బరాజ్‌లను తనిఖీ చేయించామని తెలిపారు. సుందిళ్ల ప్రాజెక్టు నిర్మాణ పనుల విషయంలో నవయుగ కంపెనీ చాలా జాప్యం చేస్తున్నదని, దీనిపై ఆ కంపెనీ ప్రతినిధులను తీవ్రంగా హెచ్చరించామని వెల్లడించారు. అన్నారంలో ఆప్కాన్స్ సంస్థ, మేడిగడ్డలో ఎల్అండ్టీ సంస్థ పనులు చురుగ్గా చేస్తున్నాయని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం జాతీయహోదా అడుగలేదని, ఈ విషయాన్ని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి షెకావత్ చెప్పారని పేర్కొన్నారు.
బరాజ్‌ల మరమ్మతు పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. యుద్ధప్రాతిపదికన పనులు చేస్తున్నామని దాటవేశారు. ఈఎన్సీ అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. రాబోయే వానకాలంలో మూడు బరాజ్‌ల సంరక్షణకు, తర్వాత ఎటువంటి డ్యామేజీ జరగకుండా పనులు చేపట్టామని తెలిపారు. మేడిగడ్డ వద్ద జీఆర్పీ, ఈఆర్టీ పరీక్షలు కొనసాగుతున్నాయని, సీకెంట్ ఫైల్స్ ఫెయిల్యూర్‌పై పరిశీలన జరుగుతున్నదని చెప్పారు. ఎన్డీఎస్ఏ చెప్పే వరకు గేట్లు ఓపెన్ చేసి పెట్టాలని చెప్పారని అన్నారు. వచ్చే సీజన్‌కు ఎన్డీఎస్ఏ అనుమతితో రిపేర్లు చేసి మేడిగడ్డ నుంచి పంపింగ్ చేసుకునే అవకాశం ఉన్నదని, వరదలు అయిపోయిన తరువాత జియో ట్యూబ్ వేసి పంప్ చేస్తామని వెల్లడించారు.
అన్నారంలో 11 మీటర్లు, సుందిళ్లలో 9 మీటర్ల వద్ద నీటిని ఆపితే ఎల్లంపల్లికి పంప్ చేసుకోవచ్చని అన్నారు. మేడిగడ్డలో బుంగ వాస్తవమేనని, ఫియర్స్ కింద ఇసుక కొట్టుకుపోవడం వల్లే బుంగ ఏర్పడిందని వివరించారు. సుందిళ్ల బరాజ్ వద్ద కొట్టుకుపోయిన ఇసుక పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రాబోయే పది రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మక్కన్‌సింగ్, లక్ష్మణ్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, చీఫ్ ఇంజినీర్ సుధాకర్, ఈఈలు యాదగిరి, తిరుపతిరావు, ఎల్అండ్టీ ప్రతినిధి సురేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. పార్వతి బరాజ్ సమీపంలోని పంప్‌హౌస్ సంరక్షణ కోసం నిర్మిస్తున్న కట్ట వల్ల వానకాలంలో తమ ఇండ్లల్లోకి నీరు వస్తున్నదని సిరిపురం గ్రామస్తులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి ఉత్తమ్ స్పందిస్తూ.. స్థానిక మంత్రితో చర్చించి ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారిని ఆదేశించారు.