హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): సింగపూర్‌కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ డెవలప్మెంట్ కంపెనీ ‘క్యాపిటల్యాండ్’ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టడం కొత్తేమీ కాదు. 2011 నుంచే హైదరాబాద్‌లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ సంస్థ గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన స్నేహపూర్వక విధానాలను దృష్టిలో పెట్టుకుని ఇదివరకే భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించింది. 2022 డిసెంబర్లో రూ.6,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు నాటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది.
అందులో భాగంగా మాదాపూర్‌లోని ఇంటర్నేషనల్ టెక్ పార్కులో రూ.1,200 కోట్లతో అత్యాధునిక డాటా సెంటర్‌ను నెలకొల్పడంతోపాటు హైదరాబాద్‌లో 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఆఫీస్ స్పేస్‌ను రూ.5 వేల కోట్లతో రెట్టింపు చేయనున్నట్టు వెల్లడించింది. మాదాపూర్‌లో ఏర్పాటు చేసే డాటా సెంటర్ 2.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 36 మెగావాట్ల విద్యుత్తు సామర్ధ్యంతో ఉంటుందని, భారత్‌లో నవీ ముంబై తర్వాత తాము ఏర్పాటు చేస్తున్న రెండో డాటా సెంటర్ ఇదేనని, వచ్చే ఐదేండ్లలో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ‘క్యాపిటల్యాండ్’ సీఈవో సంజీవ్దాస్ గుప్తా ఆనాడే ప్రకటించారు. వాస్తవానికి ఈ సంస్థ గత 30 ఏండ్ల నుంచి మన దేశంలో కార్యకలాపాలు సాగిస్తున్నది.
భారత్‌లోని 6 నగరాల్లో 12 బిజినెస్ పార్కులను నెలకొల్పిన ‘క్యాపిటల్యాండ్’.. వాటిలో మూడింటిని హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేసింది. 90 శాతం ఆక్యుపెన్సీ ఉన్న ఈ వ్యాపార కేంద్రాల్లో వివిధ బహుళజాతి కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వాటిలో దాదాపు 1.50 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
నవీ ముంబైలోని గ్రీన్‌ఫీల్డ్ డాటా సెంటర్ డెవలప్మెంట్ సైట్‌ను 2021లో కొనుగోలు చేయడం ద్వారా భారత మార్కెట్లోకి ప్రవేశించిన ‘క్యాపిటల్యాండ్’ హైదరాబాద్‌లో 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇంటర్నేషనల్ టెక్‌పార్క్ (ఐటీపీహెచ్)ను ఏర్పాటు చేసింది. దీన్ని 2023 సెప్టెంబర్‌లో నాటి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.