హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): పోలీసులకు దీటుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్‌లు ముమ్మరంగా తనిఖీలు, దాడులు చేపట్టాలని ఆ విభాగం డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి ఆదేశించారు. శనివారం ఆబ్కారీ భవన్లో స్టేట్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్)టీమ్‌లతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి, నాన్ డ్యూటీ పెయిడ్ లికర్, ఆల్పోజోలం, నాటుసారా తదితర వాటి వినియోగాలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. జీహెచ్ఎంసీతోపాటు ఇతర జిల్లాల్లో జరుగుతున్న నేరాలపై టీమ్‌లీడర్లు నిఘాపెట్టాలని ఆయన కోరారు. ఎస్టీఎఫ్లను అన్ని ప్రాంతాలకు విస్తరించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్లోని టీమ్‌లీడర్లు వారు సాధించిన విజయాలను వివరించారు. గతనెలలో 76 కేసులు నమోదు చేసి.. 212 లీటర్ల నాటుసారా, 5000 కేజీల నల్లబెల్లం, 111 కేజీల గంజాయి, 24 వాహనాలను సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ ఖురేషీ, అడిషనల్ ఎస్పీ భాసర్, అసిస్టెంట్ కమిషనర్ ప్రణవిలు, సీఐ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.