హైదరాబాద్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, నాన్-డ్యూటీ పెయిడ్ లిక్కర్ వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఈడీ కమలాసన్‌రెడ్డి హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పరిధిలో తనిఖీల కోసం ప్రత్యేకంగా దాదాపు 40 టీమ్‌లను ఏరాటు చేస్తున్నామని, అనుమానితులకు డ్రగ్ డిటెక్షన్ కిట్‌తో పరీక్షలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. మద్యం వినియోగించడానికి అనుమతి తీసుకున్న కమర్షియల్ ప్రాంతా ల్లో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ నెల 31 వరకు సోదాలు చేపడతామని తెలిపారు.
కోటి విలువైన డ్రగ్స్ పట్టివేత
న్యూ ఇయర్ వేడుకల కోసం ముంబై నుంచి తీసుకొస్తున్న ఎండీఎంఏ డ్రగ్‌ను పోలీసులు పట్టుకున్నారు. శనివారం పటాన్చెరు పోలీస్‌స్టేషన్‌లో సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేశ్, యాంటీ నార్కోటిక్ బ్యూరో ఎస్పీ చైతన్య మీడియాకు కేసు వివరాలు వెల్ల్లడించారు. ఇస్నాపూర్‌లో శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు తనిఖీ చేయగా, మహమ్మద్ సలీం అలియాస్ హమీద్ షేక్(30), ముఖేష్ దూబే (30) వద్ద కిలో నిషేధిత ఎండీఎంఏ డ్రగ్ పట్టుబడింది. వీరిని ముంబై వాసులుగా పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ రహితంగా న్యూఇయర్ వేడుకలు యాంటీ నార్కోటిక్స్ బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 21(నమస్తే తెలంగాణ): మాదకద్రవ్య రహితంగా 2025 కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు ప్రజలకు సూచించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.