Excise Department | హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ‘తాగండి..! తాగి ఊగి రాష్ట్ర ఖజానా నింపండి’ అన్నట్టుగా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకున్నదని ఆర్థికరంగ నిపుణులు అంటున్నారు. ప్రజలను తాగుబోతులుగా మార్చటం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలు నిజమేనని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండో ప్రధాన ఆదాయ వనరుగా ఎక్సైజ్‌శాఖను పేర్కొనడం ఈ వాదనకు బలాన్ని చేకూరుస్తున్నదని అంటున్నారు. వాణిజ్యం, సేల్స్ ట్యాక్స్ ద్వారా రూ.37,463 కోట్లు వస్తుందని అంచనా వేసిన ప్రభుత్వం మద్యం విక్రయాల ద్వారా రూ.27,623 కోట్లు సేకరించాలని నిర్ణయించినట్టు బడ్జెట్ పద్దుల్లో ప్రతిపాదించింది. మిగిలిన ఆదాయ మార్గాలన్నీ ఈ రెండింటి కన్నా తక్కువగా ఉండటం గమనార్హం. గత ఏడాదితో పోలిస్తే రూ. 2006 కోట్లను అధికంగా మద్యం అమ్మకా ద్వారా పొందాలని నిర్ణయించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో సరిపోల్చుకుంటే రూ.7,325 కోట్లు అదనంగా ఉందని ఆర్థిక రంగ నిపుణులు లెక్కలు కట్టి చెప్తున్నారు.
శాసనసభలో భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ఆదాయ మార్గాలను వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్లో17 శాతం ఎక్సైజ్ రాబడి ద్వారానే సమకూరే విధంగా అంచనాలు రూపోదించినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బార్లు, మద్యం ఏ4 దుకాణాల లైసెన్స్ ఫీజులు, ఎక్సైజ్ డ్యూటీ కలిపి ఎక్సైజ్ రెవెన్యూగా పరిగణిస్తారు. మద్యం బ్రాండ్‌ను బట్టి ఎక్సైజ్ పన్ను ఉంటుంది. మద్యం బేసిక్ ధర మీద 70 శాతం నుంచి 120 శాతం వరకు ఎక్సైజ్ పన్ను విధిస్తారు. విదేశీ మద్యమైతే ఈ సుంకం 150 శాతం లేదా అంతకన్నా అధికంగా ఉంటుంది. లిక్కర్ ధరల పెంపు, వైన్స్, బార్ల సంఖ్యను పెంచడం, మద్యం అమ్మకాలను పెంచటం, రాష్ట్రంలో కొత్త మద్యం కంపెనీలకు అనుమతులు ఇవ్వటం ద్వారా ఎక్సైజ్ ఆదాయాన్ని పొందే విధంగా బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.
వ్యాట్ బాదుడు మరో 22 వేల కోట్లు
ఎక్సైజ్ శాఖ నుంచి మద్యం సీసాలు తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్(టీజీబీసీఎల్) ఆధీనంలోకి వస్తాయి. టీజీబీసీఎల్ 80 శాతం వ్యాట్ విధించి దుకాణాలు, బార్లకు విక్రయిస్తుంది. వ్యాట్ ద్వారా ఈ ఏడాది రూ.22,570 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని టీఎస్‌బీసీఎల్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి పెట్టుకున్నారు. ఎక్సైజ్ రెవెన్యూ, వ్యాట్‌ను కలిపి మద్యం అమ్మకపు ఆదాయంగా గుర్తిస్తామని టీఎస్‌బీసీఎల్ అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన మద్యం వ్యాపార టార్గెట్‌ను రూ.50 వేల కోట్లుగా నిర్దేశించినట్టేనని వారు చెప్తున్నారు. 2023-24 తెలంగాణలో ఒకో వ్యక్తి సగటున మద్యం కోసం రూ.897 చొప్పున ఖర్చు చేసేవారని, గత ఏడాది అది సగటు రూ.1,623కు పెరిగిందని, వచ్చే ఏడాది ఈ సగటు రూ.2,956కు పెంచితే తప్ప ప్రభుత్వం పెట్టిన టార్గెట్‌ను అందుకోవటం సాధ్యం కాదని ఎక్సైజ్ అధికారి ఒకరు విశ్లేషించారు.
బడ్జెట్ అంచనా ఆదాయం (రూ.కోట్లలో)